పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకి ఇంకా దాదాపు 8 నెలల సమయం ఉంది. కానీ అప్పుడే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశాయి. భాజపా ఉత్తరప్రదేశ్ లో ప్రచారం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ, ఆమాద్మీ పార్టీలు పంజాబ్ లో ప్రచారం మొదలుపెట్టేశాయి.
సోమవారం జలంధర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “అధికార అకాలీ దళ్, దాని మిత్రపక్షం భాజపాకి చెందిన నేతలు చాలా మంది ఈ మాదకద్రవ్యాల వ్యాపారంలో ఉన్నారు. అందుకే వారు రాష్ట్రంలో ఈ సమస్యని అరికట్టడానికి చొరవ చూపడం లేదు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే కేవలం నెలరోజులలోగా రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల సమస్య నుంచి విముక్తి కల్పిస్తాము,” అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
పంజాబ్ లో ఈ మాదకద్రవ్యాల సమస్య కొత్తగా ఏర్పడినది కాదు. చాలా దశాబ్దాలబట్టే ఉంది. అంటే యూపియే హయంలో కూడా ఉందన్నమాట! పదేళ్ళపాటు యూపియే ప్రభుత్వమే దేశాన్ని పాలించింది. 2002 నుంచి 2007 వరకు పంజాబ్ రాష్ట్రంలో అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇన్నేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఈ సమస్యని పరిష్కరించలేనప్పుడు కేవలం నెల రోజులలోగానే పరిష్కరిస్తామంటే ఎవరు మాత్రం నమ్ముతారు?