అమరావతికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ స్పష్టత నిచ్చారు. ఖమ్మం సభకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గన్నవరం మీదుగా రాకపోకలు సాగించారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ నేతలతోనూ మాట్లాడారు. అమరావతి విషయంలో తాము సంపూర్ణ మద్దతుగా ఉంటున్నామని… స్పష్టం చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా ప్రియాంకా గాంధీ కూడా వస్తారని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అమరావతి విషయంలో బీజేపీ కూడా మద్దతుగానే ఉంది. కానీ బీజేపీ మద్దతు అంతా మోసపూరితమని ఓ వైపు అమరావతే రాజధాని అంటూ మరో వైపు రైతుల్ని అన్యాయం చేసేలా.. రాజ్యాంగాన్ని.. చట్టాల్ని సైతం ఉల్లంఘిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. చివరికి కోర్టులో ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతించింది. రాయలసీమలో ఇళ్లను సరెండర్ చేసినా అంగీకరించింది. పైకి మాత్రం బీజేపీకి మద్దతని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చివరికి జేపీ నడ్డా కూడా అన్నారు. కానీ ఇలాంటి చర్యలతో బీజేపీ … వంచనకు పాల్పడుతోందన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయితే ఆ పార్టీకి ఈ వ్యవహరంలో పెద్దగా పాత్ర లేదు. గతంలో రైతులకు దాష్టీకాలు జరిగినప్పుడు కాంగ్రెస్ స్పందించింది. ఇప్పుడు అమరావతికి ఏకపక్ష మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ విషయంలో రైతుల్లో సానుకూలత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.