టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు లేదు .. ఉండదని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చేశారు. భారత్ జోడో యాత్ర ప్రారంభ సమయంలో కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు.,. టీఆర్ఎస్తో కలిసి పని చేస్తామన్నట్లుగా ప్రకటనలు చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో కాస్త గందరగోళం ఏర్పడింది. దాన్ని రాహుల్ గాంధీ తొలగించే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత కానీ టీఆర్ఎస్తో పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాహుల్ తెలిపారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ తో పొత్తు వద్దని టీపీసీసీ నిర్ణయమని, దానిని స్వాగతిస్తున్నానన్నారు. టీఆర్ఎస్ అవినీతిమయమైన, ప్రజా ధనాన్ని లూటీ చేసే పార్టీగా మారిందన్నారు.
రాజకీయంగా కొందరు నాయకులు ఎవరికి వారు తామది పెద్ద పార్టీగా ఊహించుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ కూడా తమకు తాము నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదని రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. టీఆర్ఎస్ను గ్లోబల్ పార్టీగా మారి.. చైనాలో కూడా పోటీ చేయవచ్చని సలహా ఇచ్చారు. విషయం ఏమిటంటే చైనాలో ప్రజాస్వామ్యం లేదు. అక్కడ ఎన్నికలు జరగవు అయినా రాహుల్ అలా సెటైర్ వేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ తన ప్రత్యర్థిగా బీజేపీని ఎంచుకోవడంతో .. కాంగ్రెస్ పరిస్ధితి దిగజారిపోతోంది.
రెండు అధికార పార్టీలయిన బీజేపీ, టీఆర్ఎస్ ధన బలం ముందు కాంగ్రెస్ పోటీ పడలేకపోతోంది. దీంతో నిర్వీర్యం అయిపోతోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి సీన్ మారిపోతోందని.. బీజేపీతో తాడో పేడో అన్నట్లుగా పోరాడుతున్న టీఆర్ఎస్ చివరికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వైపు చేరుతుందన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్తో ముందు కానీ.. తర్వాత కానీ పొత్తులే ఉండవని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ నేతలకు క్లారిటీ వచ్చినట్లయింది.