కాంగ్రెస్ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన రాజకీయంగా ఇంకా దుమారం రేపుతూనే ఉంది. ఆయన ఓ సదస్సులో ప్రసంగించాడినికి వెళ్లారని కాంగ్రెస్ నాయకుల చెప్తున్నారు. కానీ బీజేపీ వారు మాత్రం రాహుల్ సరదాగా హాలిడే టూరుకు వెళ్లారని ఎద్దేవా చేస్తున్నారు. ఆ మధ్య రెండు నెలల విహారానికి వెళ్లిన విషయం గుర్తు చేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ వారు చెప్తున్న సదస్సు జులైలోనే ముగిసిందని బీజేపీ వారు బాంబు పేల్చారు. వీకెండ్ విత్ చార్జీ రోజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారని కాంగ్రెస్ నేతలు కొందరు చెప్పారు అయితే ఆ కార్యక్రమం జూన్ 25 నుంచి జులై 4 వరకు జరిగిందని బీజేపీ అధికార ప్రతినిధి నరసింహారావు చెప్పారు. అయిపోయిన కార్యక్రమంలో రాహుల్ ఎలా మాట్లాడతారని బీజేపీ వారు ప్రశ్నిస్తున్నారు.
అయినా అమెరికాలో సదస్సులకు హాజరు కావడానికి పోయేటప్పుడు రహస్యం దేనికి? రాహుల్ స్వయంగా ప్రకటించి వెళ్లవచ్చు. ఈ రోజుల్లో జిల్లా స్థాయి నాయకుల కార్యక్రమాలే ముందుగా ఫిక్స్ అవుతాయి. మీడియాకు సమాచారం ఉంటుంది. అలాంటిది అంత పెద్ద పార్టీ ఉపాధ్యక్షుడి విదేశీ పర్యటనపై అంత గుభనం ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. రాహుల్ ప్రజా జీవితంలో లేకపోతే ఆయన ఎక్కడికి వెళ్లినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఆయన ఒక ఎంపీ. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. దేశాన్ని బాగుచేయడానికి కాబోయే ప్రధాని అని కాంగ్రెస్ నేతలు ఎప్పట్నుంచో ప్రచారం చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి హటాత్తుగా కనిపించనప్పుడు చర్చ జరుగుతుంది. పోనీ, అమెరికా చేరిన తర్వాతైనా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడవచ్చు. ఆన మాట్లాడదలచుకుంటే అమెరికాలో కూడా టీవీ చానళ్ల వారు వచ్చి మరీ స్టేట్ మెంట్ తీసుకుంటారు. కానీ ఆయన ఎవరికీ కనిపించడం లేదు. అంత రహస్య జీవితానికి కారణం ఏమిటో?
రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారం చేస్తే వచ్చే సీట్లు రాకుండా పోతాయంటూ ఇప్పటికే మీడియాలో కార్టూన్లు, సెటైర్లు వస్తున్నాయి. కొన్ని తెలుగు దినపత్రికల్లోనూ ఇలాంటి కార్టూన్లు వచ్చాయి. నిజంగా ఆయన్ని బీహార్ ప్రచారానికి దూరంగా ఉంచడానికే అమెరికా పంపారా అనే అనుమానం కూడా జనంలో ఉంది. ఈ ప్రచారం నిజామా కాదా అనేది కూడా కాంగ్రెస్ శిబిరంలో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఎక్కడికి వెళ్లారు, ఏ సదస్సుకోసం అమెరికా యాత్ర చేశారనేది… అయితే రాహుల్ గాంధీ చెప్పాలి. లేదా కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఈ రెండూ జరిగేలా లేవు.