ఢిల్లీలో అధికారం చేపట్టిన వెంటనే ప్రధానమంత్రిగా మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశంపైనే పెడతానని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన… ఏపీ ప్రత్యేకహోదా అంశాన్నే హైలెట్ చేశారు. ప్రత్యేకహోదా ఏపీ హక్కు అని నినదించారు. ప్రదానమంత్రి నరేంద్రమోడీని విభజన హామీల విషయంలో కార్నర్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ బాగోగుల గురించి మన్మోహన్ ఆలోచించారన్నారు. మేం ఐదేళ్లు హోదా ఇస్తామంటే బీజేపీ నేతలు పదేళ్లు ఇవ్వాలన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే హోదాపై బీజేపీ మాట తప్పిందని మండి పడ్డారు. మన్మోహన్ ఇచ్చిన హామీల అమలుకు..బీజేపీ ప్రభుత్వం ఒక్క చర్యా తీసుకోలేదన్నారు. విభజన చట్టంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వేజోన్, మెట్రోరైలు…అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించమని గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి అన్ని రకాల ప్రయోజనాలు ప్రకటించామని.. వాటిని అమలు చేయకుండా బీజేపీ మోసం చేసిందన్నారు. ప్రత్యేక హోదాపై మోసం చేసిన మోదీకి…ఆంధ్రుల కళ్లలో కళ్లుపెట్టి చూసే ధైర్యం లేదన్నారు.
కర్నూలు పర్యటనలో.. తెలుగుదేశం పార్టీని రాహుల్ గాంధీ పల్లెత్తు మాట అనలేదు. ఏపీలో పాలన గురించి మాట్లాడలేదు. కానీ.. కేంద్రం ఏపీ విషయం చేస్తున్న అన్యాయాన్ని మాత్రం గట్టిగానే ప్రస్తావించారు. తాము మోడీలా మోసం చేయబోనని.. నమ్మకం కలిగించేందుకు ప్రయత్నించారు. నరేంద్ర మోదీలాగా నేను అబద్ధాలు చెప్పడానికి రాలేదని.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతే ఏపీలో అడుగుపెట్టను శపథం చేశారు. అదే సమయంలో.. మోడీపై జాతీయ అంశాల్లోనూ విమర్శలు గుప్పించారు. అరుణ్‌జైట్లీ అనుమతితోనే విజయ్‌మాల్యా విదేశాలకు పారిపోయాడని.. రూ. 9వేల కోట్లు దోచుకున్న దొంగ దేశం వదలివెళ్తుంటే…కేంద్రం ఏం చేస్తోందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి లంచాలు తీసుకుని…మాల్యాను దేశం బయటకి వదిలారని ఆరోపించారు. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఒక్కో రఫెల్ యుద్ధ విమానాన్ని 526 కోట్లకు కొంటే.. బీజేపీ హయాంలో ఒక్కో యుద్ధవిమానాన్ని 1600 కోట్లకు కొన్నారని మోదీ యుద్ధవిమానాల కాంట్రాక్టును తన మిత్రుడు అనిల్అంబానీకి ఇచ్చారనన్నారు. బ్యాంకుల నుంచి 45వేల కోట్లు దోచుకున్న గజదొంగ అనిల్అంబానీ అని మండి పడ్డారు. మోదీ ఆర్థిక నేరస్తుడికి యుద్ధవిమానాలు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. పార్లమెంట్లో తన సవాల్‌కు మోదీ సమాధానం చెప్పలేదని… తన కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం చేయలేకపోయారన్నారు.
రాహుల్ గాంధీ పర్యటన.. అనుకున్నట్లుగానే సాగింది. రాహుల్ సభలో కొంత మంది కావాలని కాకుండా..అందర్నీ కలిపి చేసిన విమర్శల్లో టీడీపీని కూడా కలిపారు. కానీ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయలేదు. వైసీపీపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేకహోదా విషయంలో ఎలాంటి రాజకీయ అడుగులు పడాలని..టీడీపీ కోరుకుంటుందో.. అలాంటి ట్రాక్ నే.. తన పర్యటన ద్వారా రాహుల్ గాంధీ ఏర్పరిచారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.