నావల్ల కాదు… అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత తనదే అన్నారు. ఆ సమయంలో, మీరే ఉండాలంటూ నాయకుల రాజీనామాల ప్రహసనాలూ… గాంధీయేతర కుటుంబానికి పగ్గాలిచ్చినా ఫర్వాలేదంటూ రాహుల్ గాంధీ ప్రకటనలు… ఈ హడావుడి అంతా అందరికీ గుర్తున్నదే. ఓ మహా డ్రామా ముగిశాక చిట్ట చివరికి మళ్లీ సోనియా గాంధీకే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పుడు విషయం ఏంటంటే… త్వరలో రాహుల్ గాంధీకే మళ్లీ పార్టీ పగ్గాలు తిరిగి ఇచ్చే అవకాశం ఉందని కథనాలు వస్తుండటం, దానికి అనుగుణంగా నాయకుల ప్రకటనలు ప్రారంభం కావడం.
మూడురోజుల పర్యటన కోసం కేరళలోని తన నియోజక వర్గం వాయనాడుకు రాహుల్ గాంధీ వెళ్లారు. ఆయన వెంట కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. ఈయన మీడియాతో మాట్లాడుతూ… త్వరలోనే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. మరి, గడచిన జులైలో బాధ్యతల నుంచి తప్పుకున్నారు కదా అంటే… అది ఎమోషనల్ గా తీసుకున్న నిర్ణయంగా చూడాలన్నారు! వచ్చే నెలలో ఎ.ఐ.సి.సి. సమావేశం ఉందనీ, దాన్లో రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. అయితే, పార్టీ పగ్గాలు తనకు వద్దని ఒక సైనికుడిగా పనిచేస్తానని చెప్పిన రాహుల్, ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే… పార్టీలో చాలామంది అభిప్రాయమే ఇదనీ, అందరూ నచ్చజెబితే ఒప్పుకుంటారని నమ్మకం ఉందని వేణుగోపాల్ చెప్పారు.
రెండోసారి ఓటమి అనంతరం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం లేదనీ, పార్టీని ముందుకు నడిపించే వ్యూహాత్మక నిర్ణయాలు జాతీయ నాయకత్వం తీసుకోలేకపోతోందనే అభిప్రాయం ఉంది. ప్రతిపక్ష పార్టీగా భాజపాని సమర్థంగా ఎదుర్కోవడంలో ఢిల్లీ స్థాయిలో తడబడుతూనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ కి వచ్చే నెలలోనే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలంటూ చర్చించడం కూడా వ్యూహాత్మక తప్పిదమే అవుతుందనడంలో సందేహం లేదు. సోనియా ప్రస్తుతం తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించినా, అంతిమంగా రాహుల్ కే పగ్గాలు దక్కుతాయన్నది చాలామందికి ఉన్న నమ్మకం. అంతేతప్ప, మరెవరికో పీఠం దక్కేస్తుందనే పరిస్థితి లేదు కదా! వద్దని తప్పుకున్న ఆర్నెల్లలోపే మళ్లీ ఆయనకే పగ్గాలు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోందంటే… ఆ అవసరం ఏంటో స్పష్టం చెయ్యాల్సిన అవసరం ఉంది.