కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే నెల విశాఖ ఏజన్సీ ప్రాంతంలో పాదయాత్ర చేయబోతున్నారని సమైక్య రాష్ట్ర మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిన్న ప్రకటించారు. అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు అడవులపై తిరిగి హక్కులు కల్పిస్తూ యూపియే ప్రభుత్వ హయంలో చేసిన ఆర్.ఎఫ్.ఆర్. చట్టానికి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా విశాఖ ఏజన్సీలో నివసిస్తున్న గిరిజనులకు దాని గురించి అవగాహన కల్పించేందుకు రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేపట్టాలనుకొంటున్నారని మనోహర్ తెలిపారు. ఆయన చింతపల్లి లేదా పాడేరులో పాదయాత్ర చేసే అవకాశం ఉందని మనోహర్ తెలిపారు. త్వరలోనే అయన పర్యటన ఖరారు చేసి వివరాలు తెలుపుతామని చెప్పారు.
అటవీ ప్రాంతంపై గిరిజనులకే పూర్తి హక్కులు ఉన్నప్పటికీ తెదేపా ప్రభుత్వం విశాఖ ఏజన్సీలో 1414 ఎకరాలలో బాక్సైట్ త్రవ్వకాలు చేయడానికి జి.ఓ.(నెంబర్:97) జారీ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా ఆ ప్రాంతంలో బాక్సైట్ త్రవ్వకాలు జరపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పారా మిలటరీ దళాలను పంపాలని కేంద్రాన్ని కోరడం, గిరిజనుల సంక్షేమం కోసం సబ్-ప్లాన్ క్రింద మంజూరైన నిధులను వారి కోసం ఖర్చు చేయాలనుకోవడం రెండూ తప్పేనని మనోహర్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకొనే అవకాశాలు కనబడటం లేదు. అందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏమాత్రం బాధపడుతున్నట్లు లేదు. రాహుల్ గాంధీ మొక్కుబడిగా ఇటువంటి పర్యటనలు చేయడం వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనమూ కూడా కలుగదు. కానీ ఆయన పర్యటన చేసినప్పుడు దాని నుంచి వైకాపా ప్రేరణ పొందుతుండటం విశేషం.
ఇదివరకు రాహుల్ గాంధీ అనంతపురంలో పాదయాత్రకి వచ్చినప్పుడు ప్రత్యేక హోదాపై వైకాపా పోరాడితే బాగుంటుందని సూచించడంతో జగన్ తక్షణమే పోరాటం మొదలుపెట్టేయడం అందరూ చూసారు. ఈసారి బాక్సైట్ త్రవ్వకాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేయమని చెపుతారేమో? లేకపోతే జగన్ దేనిపై పోరాటం చేయాలో సూచించి వెళ్తారేమో? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో ఆ పార్టీకి ఏ ప్రయోజనం లేకపోగా దాని నుంచి వైకాపా ప్రేరణ పొందడం విచిత్రంగానే ఉంది.