కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని మళ్లీ రాహుల్ గాంధీ చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత సీనియర్లపై అలిగిన రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు వదిలేశారు. తాను మళ్లీ తీసుకునే ప్రశ్నే లేదని భీష్మించుకు కూర్చున్నారు.దాంతో.. మళ్లీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ అధ్యక్ష పదవి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటివరకూ ఆమె ఉన్నారు. అయితే ఇప్పుడు.. కాంగ్రెస్‌లో పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతూండటంతో పూర్తి స్థాయి అధ్యక్ష పదవిని భర్తీ చేయాలన్న డిమాండ్లు ప్రారంభమయ్యాయి. సీనియర్లు రెబల్స్‌గా మారారు. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయాలంటే అధ్యక్షుడు ఉండాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు.
చివరికి రాహుల్ గాంధీ పార్టీ కోసం పని చేయడానికి సిద్ధమని ప్రకటించారు. బహుశా… అంటే ఆయనే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నారని ప్త్యేకంగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా… గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని నియమిస్తే.. రాహుల్ … సూపర్ ప్రెసిడెట్గా వ్యవహరించాల్సి ఉంటుంది. అది మరికొన్ని కొత్త సమస్యలకు కారణం అవుతుంది. ప్రస్తుత పార్టీలో గాంధీ విధేయులు.. ఓ వర్గంగా ఉంది. పార్టీని గాంధీ కుటుంబంతో సంబంధం లేకుండా నడపాలని మరో వర్గం అంటోంది. అయితే రెండో వర్గం పరిమితంగానే ఉంది. వారిలో ప్రజా క్షేత్రంలో నెగ్గుకొచ్చేవారు తక్కువ. దాంతో వారికి పెద్దగా బలం లేకుండా పోయింది.
రాహుల్ అస్త్ర సన్యాసం చేసినప్పుడు ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ పార్టీలో కూడా వినపించింది. 2024 ఆమెను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ మెరుగుపడుతుందని అప్పట్లో డిమాండ్ కూడాచేశారు. కానీ ఇప్పుడు మళ్లీ అందరూ రాహుల్ మాటే వినిపిస్తున్నారు. పార్టీలో మాత్రం ప్రియాంక, రాహుల్ కలిసి పనిచేస్తే పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌కు రాహుల్ తప్ప మరో ఆప్షన్ లేదన్న విషయం మాత్రం స్పష్టమయిందని.. బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.