ఆంధ్ర ప్రదేశ్‌లో లోకేశ్ బాబు, తెలంగాణలో కెటిఆర్, తమిళనాడులో స్టాలిన్, కర్ణాటకలో కుమారగౌడ ఇలా పార్టీలలో వారసత్వ నాయకత్వాలు బాగా వర్థిల్లుతున్నాయంటే ముందుగా కృతజ్ఞతలు చెప్పవలసింది కాంగ్రెస్ పార్టీకే! జివోపి గ్రాండ్ ఓల్డ్ పార్టీలో గత డెబై ఏళ్ల స్వాతంత్రంలోనూ ఒకటి,రెండు సందర్బాలు తప్ప నెహ్రూ కుటుంబ నాయకత్వమే నడుస్న్నుది. తప్పనిసరై మరెవరినైనా అద్యక్షులుగా ప్రధానులుగా చేసినా అసలు అధికారం కుటుంబీకుల చేతుల్లోనే వుండిపోయింది. ఇదంతా నిజమే గాని ఇప్పుడు రాహుల్ గాంధీ మాత్రం అమ్మ సోనియా నుంచి అద్యక్షపీఠం తీసుకోవడానికి చాలా ఆలస్యం చేసి ఇప్పుడిప్పుడే సిద్ధమైనారు. కాని ఈ కాలంలో దేశంలో వాతావరణం కొంత మారింది గనక కాంగ్రెస్ బాగా బలహీన పడింది గనక అచ్చంగా వారసత్వ తరహాలో గాక ఒకింత పోటీ వుంటే బాగుంటుందని ఆలోచించారట. ఎందుకంటే సోనియాగాంధీపైన జితేంద్ర ప్రసాద పివి నరసింహారావుపైన శరద్ పవార్ వంటి వారు ఒకప్పుడు పోటీ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఉత్తుత్తి పోటీకి కూడా ఎవరూ ఒప్పుకోలేదట.జితేంద్ర ప్రసాద కుమారుడైన జితిన ప్రసాద ఆ మాట వినడానికే హడలిపోతున్నారు. మాజీ మంత్రి మాటకారి మనీష్ తివారిని కదిలిస్తే పుస్తకాలు రాసుకుంటాను ఇదంతా ఎందుకన్నాడట. పార్టీలో కొందరు ప్రియాంక గాంధీ మెరుగని సూచిస్తున్నా ఆమె వచ్చినప్పుడు కదా అని చప్పరించేస్తున్నారు.
రాహుల్ అద్యక్ష పదవి చేపట్టగానే ప్రచార బాధ్యతలు తీసుకోవడానికి ఆమె సిద్ధంగానే వున్నారట. కనుక రాహుల్ గాంధీ ఏకపక్షంగా అద్యక్షుడై పోవడమే తరువాయి.
అన్నట్టు ఇతర ప్రాంతీయ పార్టీలలోనూ ఇదే తరహాలో పుత్రకామేష్టి జరగబోతున్నది. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ కుమారుడు మాజీ మంత్రి తేజస్వి యాదవ్‌కు పగ్గాలప్పగించేస్తున్నారు. కేంద్ర మంత్రి లోక్‌జనశక్తి నేత రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడ చిరాగ్ పాశ్వాన్‌ను ముందుకు తెస్తున్నారు. ఆఖరుకు తండ్రీ కొడుకులు కలహించుకున్న యుపిలోనూ ములాయం వెనక్కు తగ్గి కుమారుడు అఖిలేష్‌నే సమాజ్‌వాదిపార్టీ అద్యక్షుడివి కమ్మని ఆశీర్వదించారు. కాకపోతే వీరంతా ప్రతిపక్షంలో వున్నవారే.