కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఫిబ్రవరి రెండవ తేదీన అనంతపురం జిల్లాలో బండ్ల గ్రామంలో పర్యటించనున్నారని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మీడియాకి తెలియజేసారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు తమ యు.పి.ఏ. ప్రభుత్వం ప్రారంభించిన గ్రామీణ ఉపాధి హామీ పధకానికి వచ్చే మంగళవారంతో పదేళ్ళు పూర్తవుతాయి. యు.పి.ఏ. హయాంలో దేశ వ్యాప్తంగా ప్రారంభించబడిన ఆ పధకాన్ని మొట్ట మొదట జిల్లాలో బండ్ల గ్రామం నుండే ప్రారంభించబడింది. ఆ పధకం పదవ వార్షికోత్సవం సందర్భంగా బండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే కార్యక్రమానికి రాహుల్ గాంధి హాజరుకాబోతున్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ పధకానికి మోడీ ప్రభుత్వం పేరు మార్చి ‘మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి పధకం’ అని పేరు పెట్టి, దానిని తన స్వంత పదకంగా చెప్పుకొంటోందని రఘువీరా రెడ్డి ఆరోపించారు. కనీసం దానిని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు.