కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఇది తెలంగాణలో తొలి పర్యటన. గత నెలలో ఓ సారి.. తెలంగాణలో పర్యటించినా.. అప్పటికి.. ఇంకా ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో క్లారిటీ లేదు. అప్పుడు సీమాంధ్రులు, మహిళలను ఆకట్టుకునే కార్యక్రమాలు డిజైన్ చేశారు. ఈ సారి…పూర్తిగా మైనార్టీలను దృష్టి పెట్టుకుని సభలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా భైంసా, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, చార్మినార్ దగ్గర సభలు ఏర్పాటు చేశారు. అన్నీ ముస్లిం ప్రాబల్య ప్రాంతాలే. కాంగ్రెస్ నేతలు రాహుల్ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మైనార్టీలు.. ఎన్నికల ఫలితాల్ని నిర్దేశించే పరిస్థితులో ఉన్నారు.
దాదాపుగా పన్నెండు శాతం మంది మైనార్టీలు ఉన్నారు. వీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్లు. హైదరాబాద్ పాతబస్తీ ఏరియాలో మాత్రం.. మజ్లిస్‌కు జైకొట్టినా… మిగత ప్రాంతాల్లో కాంగ్రెస్ అండగా నిలిచేవారు. మజ్లిస్ కూడా.. గత ఎన్నికల ముందు వరకూ..కాంగ్రెస్ పార్టీతోనే సన్నిహితంగా ఉండేది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో… కాంగ్రెస్ తో తేడాలొచ్చాయి. ఓవైసీ బ్రదర్స్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా పట్టించుకోలేదన్న కోపంతో వారు.. టీఆర్ఎస్ వైపు మొగ్గారు. ఎన్నికలు ముగిసిన తర్వాత.. టీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తోంది. ఆ పార్టీకే తాము మద్దతుగా ఉంటామని పదే పదే ప్రకటనలు చేస్తోంది. దానికి కారణం… ఓవైసీ బ్రదర్స్ ను కేసీఆర్ ఎప్పటికప్పుడు… సంతృప్తి పరచడమే.
అయితే.. ఇప్పుడు.. పరిస్థితుల్లో మార్పు తీసుకు రావడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ బీజేపీతో సన్నిహితంగా ఉంటూండటంతో.. ఈ విషయాన్ని హైలెట్ చేసి.. పాతబస్తీ కాకపోయినా.. ఇతర ప్రాంతాల్లో అయినా..మైనార్టీ ఓటర్లను.. ఆకట్టుకుంటే.. తమ గెలుపు సులువు అవుతుందన్న అంచనాల్లో కాంగ్రెస్ ఉంది. ఈ విడత పర్యటనను రాహుల్ గాంధీ మైనార్టీలకు అంకితం చేశారు.