”కాంగ్రెస్ పార్టీని కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓడించుకోగలదు. అప్పుడే ప్రతిపక్షాలు విజయం సాదిస్తుంటాయి తప్ప ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని ఓడించడం వలన కాదు.” ఇది కాంగ్రెస్ నేతలు అందరూ చాలా కాలంగా గొప్పగా చెప్పుకొంటున్న విషయం. తిరువనంతపురంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధి పార్టీ నేతలను ఉద్దేశ్యించి ప్రసంగించినప్పుడు ఆయన కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవించారు. తమ పార్టీని తామే ఓడించుకొంటే తప్ప ఇతర పార్టీలు ఏవీ కాంగ్రెస్ పార్టీని ఓడించలేవని అన్నారు. కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కి కూడా అదే సూత్రం వర్తిస్తుందని అన్నారు. కానీ 1982 నుండి వామ పక్షాల నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లకు కేరళ ప్రజలు మార్చిమార్చి అధికారం కట్టబెడుతున్న సంగతి రాహుల్ గాంధి చెప్పలేదు. ప్రస్తుతం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది కనుక ఆ ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది జరుగబోయే ఎన్నికలలో కేరళ ప్రజలు దానిని ఓడించి, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారం కట్టబెట్టవచ్చును. ఆ ఆనవాయితీ గురించి తెలిసినందునే రాహుల్ గాంధి అప్పుడే ఓటమి గురించి మాట్లాడుతున్నారేమో?
ప్రధాని నరేంద్ర మోడి గురించి కూడా రాహుల్ గాంధి వ్యక్తం చేసిన అభిప్రాయలు కొంచెం సహేతుకంగానే ఉన్నాయని చెప్పవచ్చును. “ప్రధాని మోడీ రాజకీయాలనయినా, ఎన్నికలనయినా మరీ ఎక్కువ లోతుగా ఆలోచించకుండా దానినొక పనిలా భావించి చేసుకుపోతారు. అప్పటికి ఏది అవసరమో దానినే హైలైట్ చేసి మాట్లాడేసి ఫలితం రాబట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ప్రజలను ఆకట్టుకొనే మాటలో…ఏదో ఒక నినాదమో..చెపుతూ ముందుకు సాగిపోతుంటారు తప్ప ఆ మాటలలో నిజాయితీ, చిత్తశుద్ధి కనిపించదు. బీహార్ ఎన్నికలలో కూడా ఆయన అలాగే ప్రయత్నించారు. ఆయన తీరును నిశితంగా గమనించిన మేము నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లను దగ్గరకి చేర్చి వారితో కలిసి నరేంద్ర మోడీకి చెక్ పెట్టగలిగాము. అది చూసి బీజేపీ నేతలు కూడా షాక్ అయ్యారు. మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి గురించి ఆలోచిస్తుంది. బీజేపీ, మోడీ ప్రభుత్వం ప్రజలకున్న అధికారాలను లాగేసుకొంటుంది. నిరుపేదలను, వాళ్ళ హక్కులను కూడా దోచుకొంటుంది,” అని రాహుల్ గాంధి అన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీయే దేశాన్నిపరిపాలించింది. అధికారంలో రావడానికి ఇందిరా గాంధీ ‘గరీబీ హటావో’ అని నినాదం చేసారు. ఆమె అధికారంలో వచ్చేరు కానీ నేటికీ దేశంలో పేద ప్రజల పరిస్థితులలో మార్పు రాలేదు. ఆ తరువాత ఇరవై సూత్రాల పధకం వంటి అనేకం ప్రకటిస్తూనే ఉన్నారు కానీ ఆశించినంతగా దేశాభివృద్ధి జరుగలేదు. దేశాన్ని అభివృద్ధి చేయలేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కుంభకోణాలు జరగడం సర్వసాధారణమయిన విషయం అయిపోయింది. వాటి వలన లక్షల కోట్ల దేశ సంపద విచ్చలవిడిగా దోపిడీ జరిగేది. అందుకే దేశ ప్రజలు 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని నిర్ద్వందంగా తిరస్కరించి బీజేపీకి పట్టం కట్టారు. ఈ విషయాలన్నీ రాహుల్ గాంధి తెలియదనుకోలేము. కానీ తెలియనట్లు నటిస్తున్నారు. 2014 ఎన్నికలలో మోడీ ఏటికి ఎదురీది విజయం సాధిస్తే , రాహుల్ గాంధి చేతిలో అధికారం, అర్ధబలం, అంగబలం, అపారమయిన రాజకీయ అనుభవం ఉన్న హేమాహేమీలవంటి సీనియర్ నేతలు ఆయన వెనుక నిలిచినా పార్టీని గెలిపించుకోలేకపోయారు. ఎన్నికల సమయంలో కనీసం పార్టీకి సారద్యం వహించదానికి కూడా భయపడ్డారు. అప్పటి నుండి రాహుల్ గాంధిలో ఆత్మన్యూనత మొదలయింది. ఆ కారణంగానే నరేంద్ర మోడీని విమర్శిస్తుండటం ద్వారా తాను ఆయన కంటే ఏమాత్రం తీసిపోనని నిరూపించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ ఆత్మన్యూనత కారణంగానే మోడీని విమర్శిస్తున్నారని చెప్పవచ్చును. అయితే నరేంద్ర మోడీని విమర్శించినంత మాత్రాన్న రాహుల్ గాంధి స్థాయి పెరిగిపోదు. మేధావి అయిపోలేడు. స్వతః సిద్దంగా నాయకత్వ లక్షణాలు, పోరాటపటిమ, రాజకీయ చతురత వంటి లక్షణాలు ఉన్నవారు మాత్రమే నాయకులు కాగలరు. రాహుల్ గాంధిలో అవన్నీ లోపించినందునే ఆయన పార్టీ అధ్యక్ష పదవి చేపట్టబోతే పార్టీలో నేతలే అభ్యంతరం చెప్పారు. ఆయన ప్రధాని పదవి చేపట్టాలనుకొన్నందునే దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి ఇంటికి పంపేశారు. బీహార్ ఎన్నికలలో రాహుల్ గాంధి చేసింది ఏమీ లేదు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ తమ స్వశక్తితో, రాజకీయ వ్యూహలతో మోడీని ఓడించి విజయం సాధించారు. కనుక దేశ ప్రజల కాలక్షేపం కోసం రాహుల్ గాంధి మోడీ గురించి ఎన్ని మాటలయినా చెప్పవచ్చును. ఎన్ని విమర్శలయినా చేసుకోవచ్చు కానీ రాహుల్ గాంధి ఎన్నటికీ నరేంద్ర మోడీకి సరితూగలేడు. ఆ సంగతి ఆయనకి తప్ప సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు.