కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే… ఏముంది, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం వ్యూహరచనలో ఉన్నారు అని చెప్పొచ్చు. దాని కోసం పార్టీ నాయకుల సలహాలు తీసుకుంటున్నారు, కొన్ని బృందాలతో సర్వేలు చేయించుకుంటున్నారు అని చెబుతున్నారు. సరే, అదంతా ఎలాగూ రొటీన్ గా జరుగుతున్న ప్రాసెస్. కానీ, దీన్లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే… ప్రతీ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి ఆయన ఆరా తీస్తున్నట్టు సమాచారం! ఎందుకంటే, ఆయన ఇకపై ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించాలని అనుకుంటున్నారట. దీన్లో భాగంగా ముందుగా ఆయన కర్ణాటకలోని శృంగేరి పీఠానికి వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. దానికి సంబంధించి షెడ్యూల్ తయారు చేయాలంటూ ఏఐసీసీ వర్గాలను రాహుల్ కోరినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం..!
ప్రస్తుతం ఆయన దృష్టి కర్ణాటకపైనే ఎందుకు పడిందంటే… అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా! ఆ రాష్ట్రంలో మఠాలూ పీఠాల సంఖ్య ఎక్కువ. ఇక్కడ భాజపా మరోసారి హిందుత్వ భావజాలం కార్డును ఉపయోగించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి, కమలనాథులకు ఆ అవకాశం ఇవ్వకుండా… కాంగ్రెస్ కూడా అదే ధోరణిలో ఉందనే సంకేతాలు ఇవ్వడం అనేదే ఈ పర్యటనల వెనక ఉన్న అసలు కారణం. నిజానికి, గుజరాత్ ఎన్నికలప్పుడు కూడా ఇదే పని చేశారు. దాదాపు ఓ పాతిక దేవాలయాలను చుట్టేశారు. ఎన్నికల తరువాత కూడా మరోసారి సోమనాథ్ ఆలయానికి వెళ్లారు. తాను హిందూ బ్రాహ్మిణ్ అని చెప్పుకున్నారు కూడా. ఇదే పరంపరలో దేశంలోని ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ చుట్టి రావాలనేది రాహుల్ ఆలోచన అంటున్నారు.
లోక్ సభ ఎన్నికలు వచ్చేలోపు తాను కూడా హిందూ అనుకూలవాదినే ఇమేజ్ సృష్టించుకోవడం కోసమే రాహుల్ ప్రయత్నం అనేది అర్థమౌతోంది. 2014 ఎన్నికల్లో జరిగిన పొరపాటును పునరావృతం కాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా ఉన్నప్పుడు.. ఆమె ఇటాలియన్ అనీ, క్రైస్తవ భావజాలం ఆ పార్టీలో కొంత ఎక్కువగా కనిపిస్తుంటుందనే ప్రచారం భాజపాకి కొంత ప్రయోజనాన్ని చేకూర్చింది. ఇప్పుడా చర్చకే ఆస్కారం లేకుండా చేయాలనేది రాహుల్ తాజా వ్యూహం. అందుకే, అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చారనీ, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆలయాలూ ఆధ్యాత్మిక క్షేత్రాల జాబితా తయారు చేయమన్నట్టు సమాచారం. ఆయా రాష్ట్రాల పర్యటనలకు వెళ్లినప్పుడు గుళ్లూ గోపురాల సందర్శన కూడా ఓ కార్యక్రమంగా షెడ్యూల్ లో ఉండాలనేది రాహుల్ తాజా ఆదేశంగా కథనాలు వినిపిస్తున్నాయి.