రాహుల్ గాంధీ వైఖరి మారదా?
పెను విషాదం సంభవించినప్పుడు పరామర్శల పేరుతో నాయకులు యాత్రలు చేస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఇది చిన్న పిల్లలకైనా తెలిసిన విషయం. కానీ కాంగ్రెస్ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మాత్రం తెలిసినట్టు లేదు. కోల్ కతాలో ఫ్లై ఓవర్ కూలిన ప్రదేశాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించడానికి ఆయన ఆగమేఘాల మీద ఢిల్లీనుంచి వాలిపోయారు.
ఆయన వచ్చి పరామర్శించగానే క్షతగాత్రుల గాయం మానిపోతుందా? ఆయన పరామర్శించక పోతే గాయపడ్డవారికి చికిత్స ఆగిపోతుందా? ఓ వైపు స్థానిక అధికారులతో పాటు ఆర్మీ, ఎన్ డి ఆర్ ఎఫ్, సేవాభావం గల స్థానిక యువకులు, ఆరెస్సెస్, ఇతర సంస్థల ప్రతినిధులు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. చేతనైతే తన పార్టీ కార్యకర్తలను కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పాలి. కానీ రాహుల్ అలా చేయలేదు. పరామర్శ పేరుతో హడావుడి చేశారు.
ఎస్పీజీ సెక్యూరిటీగల రాహుల్ గాంధీ తన గన్ మెన్ తో హడావుడి చేశారు. పార్టీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది, అదనంగా స్థానక పోలీసుల హడావుడి వల్ల సహాయక చర్యలకు, ఆస్పత్రిలో చికిత్సలకు ఆంటకం కలుగుతుందనే కనీస ఆలోచన కూడా ఆయనకు రాలేదు. ఇదో రకం ఓటు బ్యాంకు రాజకీయమని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ లు విమర్శించినా ఆయన పట్టించుకోలేదు. శవరాజకీయాలు చేయవద్దని ఎందరు సూచించినా వినలేదు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, ఆయన మొండిగా కోల్ కతాలో పర్యటించడం ద్వారా ఓట్లు పొందాలని భావించినట్టున్నారు. కనీసం ఇలాంటి పర్యటన చూసి ప్రజలు ఓటు వేస్తారా లేక ఆయన వైఖరిని నిరసిస్తారా అనేది ప్రశ్న.
ఎక్కడ విషాదం జరిగితే అక్కడ వాలిపోయ పరామర్శ యాత్ర చేయడం కొందరు రాజకీయ నాయకులకు అలవాటు. అదే వాళ్లకు తెలిసిన రాజకీయం. విషాదంలో ఓట్ల వేట సబబు కాదని ఎంత మంది చెప్పినా వాళ్లు వినరు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడిగా, యువ నేతగా రాహుల్ కొత్త ఒరవడికి నాంది పలుకుతారని భావించిన వారికి, అందుకు భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. బెంగాల్లో తన పార్టీని గెలిపించడానికి ఇది సరైన పద్దతి కాదని సోనియా గాంధీ గానీ, పార్టీలోన సీనియర్లు గానీ చెప్పలేదా అనేది అర్థం కాదు. రాహుల్ మినహా ఇతర పార్టీల నాయకులు ఎవరూ ఢిల్లీ నుంచి క్యూ కట్టి పరామర్శ యాత్రలకు వెళ్లలేదు. హైదరాబాద్ యూనివర్సిటీలో అసలేం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండానే రాహుల్ ప్రత్యేక విమానంలో వచ్చి పరామర్శ యాత్ర చేశారు. ఢిల్లీ జెఎన్ యు లో విద్యార్థులకు అండగా ఉంటానని ప్రసంగించి, జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిని సమర్థించారనే విమర్శకు గురయ్యారు.