కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. అవిశ్వాసంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీకి ఇచ్చిన ఆలింగనం వెనుక ఉన్న రాజకీయం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. కొంత మంది పిల్ల చేష్ట అన్నారు..మరికొంత మంది ప్రేమతో సాధిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇందులో ఏది నిజమో కానీ.. ఈ ఆలింగనం.. రాహుల్‌కు ఓ కొత్త మిత్రుడ్ని.. అదీ కూడా.. ఎవరూ ఊహించని మిత్రుడ్ని తెచ్చే పెట్టే అవకాశాలకు బీజం వేసింది. రాహుల్‌ను దొరకబోయే ఆ కొత్త మిత్రుడు ఎవరో కాదు.. శివసేన.
రాహుల్ గాంధీ..లోక్‌సభలో మోదీని ఆలింగనం చేసుకోవడాన్ని శివసేన అభినందించింది. ఆ పార్టీ పత్రిక సామ్నాలో రాహుల్ నిజమైన రాజకీయ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ సాధించారని ప్రశంసించింది. ఇది ఆలింగనం కాదని, మోదీకి షాక్ అని పేర్కొంది. బీజేపీకి ఇలాంటి ప్రకంపనలు ఇకపై చాలా ఉంటాయని హెచ్చరించింది. రాహుల్‌పై శివసేన చూపించిన ఆసక్తి అలా చర్చల్లో ఉండగానే ఈ సారి రాహుల్ గాంధీ లీడ్ తీసుకున్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 58వ జన్మదినం జరుపుకుంటున్న ఉద్ధవ్ థాకరే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని రాహుల్ ట్వీట్ చేశారు. ఇది మహారాష్ట్ర రాజకీయ నేతలను ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది.
నిజానికి శివసేన .. తెలుగుదేశం పార్టీలా..కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పడిన పార్టీ. కానీ ఇప్పుడు బీజేపీ అంటే…శివసేన కూడా… నిప్పుల మీద ఉన్నట్లు ఫీలవుతోంది. తమ పార్టీని బీజేపీ కబళించడానికి ప్రయత్నించిందనేది ఆ పార్టీ అధినేత అనుమానం. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదని చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బతిమాలినా… ఉద్దవ్ థాకరే పట్టించుకోలేదు. ఇప్పుడు ఉద్దవ్ ధాకరే..తన ఎటాక్ మొత్తాన్ని బీజేపీపైనే దృష్టి కేంద్రీకరించారు.
పరస్పర అభినందనలు.. రెండు పార్టీల్లోని కొత్త తరాల మధ్య.. కొత్త స్నేహాన్ని చిగురింప చేసే అవకాశాలను కొట్టి పారయలేమని కొంత మంది వాదిస్తున్నారు. ఎందుకంటే.. బీజేపీని వదిలేసి ఒంటరిగా పోటీ చేస్తే… కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమికి స్వీప్ చేస్తుంది. బీజేపీ- శివసేన మధ్య ఓట్లు చీలిపోతాయి. అదే కాంగ్రెస్ -శివసేన పొత్తుపెట్టుకుంటే మాత్రం సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి.