రాజకీయ విమర్శలు చేస్తే చేశారు.. కానీ ఇలాంటి విష ప్రచారం ఏమిటి? అవగాహన లేకుండా కొందరు, రాహుల్ పై ఉన్న కసితో మరికొందరు… ఒక ఫొటోను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా షేర్ చేస్తున్నారు. ఒక బహిరంగ వేదికపై రాహుల్ గాంధీ పక్కన ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది, ఆ అమ్మాయి చేతిని మురిపెంగా పట్టుకుని ఉంటాడు రాహుల్.. ఈ ఫొటోను అడ్డంపెట్టుకుని రాహుల్ పై తీవ్రమైన మాటలతో కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అతడిని స్త్రీలోలుడిగా చూపడానికి వీరు తపిస్తున్నారు.
ప్రత్యేకించి ఈ విషయంలో బీజేపీ మద్దతుదారులు, మోడీ భక్తులు ముందున్నారని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. అయితే అసలు విషయం ఏమనగా.. ఆ అమ్మాయి మరెవరో కాదు, రాహుల్ కు కూతురితో సమానమైన మేనకోడలు! ప్రియాంకగాంధీ కుమార్తె. ఒక కార్యక్రమంలో మామయ్య పక్కన మురిపెంగా కూర్చుంది ఆ అమ్మాయి. ఆమె చేతిని లాలనగా రాహుల్ తన చేతికి తీసుకున్నాడు.
అయితే ఆమె ప్రియాంక కూతురు అని తెలియక చాలా మంది ఈ పోస్టును షేర్ చేస్తూ రాహుల్ ను దూషించడం మొదలుపెట్టారు. మరికొందరు తెలిసి కూడా రాహుల్ పక్కన ఎవరో అమ్మాయి అంటూ.. షేర్ చేసి అతడికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి మేనకోడలి పక్కన కూర్చున్న ఫొటోలను కూడా ఇలా వాడేసుకోవడం అత్యంత హేయమైన చర్య, ఏ రాజకీయ నేతలో ఇలాంటి పని చేశారంటే వాళ్లంతే అని అనుకోవచ్చు కానీ, సగటు నెటిజన్లు కూడా ఇలా వ్యవహరించడం దుర్మార్గం. రాహుల్ అంటే కోపం ఉండొచ్చుగాక… అంత మాత్రాన ఇలా చేయడం మాత్రం భావ్యం కాదు.