కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాహుల్, అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. పనిలో పనిగా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు లైన్లో నిలబడిన ప్రజలతో మాట్లాడుతున్నారు. వారి కష్టాలను మీడియాకు చెప్పిస్తున్నారు. ఆ తర్వాత ఇదిగో పెద్ద నోట్ల రద్దు ప్రభావమంటూ ప్రధాని మోడీని దుయ్యబడుతున్నారు.
ఈ తరహా పర్యటనల్లో భాగంగా ఆయన ఈనెల రెండో వారంలో తెలంగాణకు రానున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి కూడా రాహుల్ పర్యటన ఉందని నిర్ధారించారు. అయితే కచ్చితమైన తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఒకటి లేదా రెండు రోజుల పాటు రాహుల్ తెలంగాణలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాదులో పెద్దనోట్ల రద్దు ప్రభావంపై ప్రత్యక్షంగా వాస్తవాలు తెలుసుకుంటారు. ప్రజలతో మాట్లాడతారు.
అలాగే ఏదైనా జిల్లాలోనూ రాహుల్ పర్యటించే అవకాశం ఉంది. అది ఏ జిల్లా అనేది మాత్రం పార్టీ వర్గాలు కచ్చితంగా చెప్పడం లేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని రాహుల్ ఘంటాపథంగా చెప్తున్నారు. దీనికి అనుగుణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిరసన బాట పట్టింది. నిరసన ప్రదర్శనల్లో ఉత్తం తోపాటు చాలా మంది పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినా ఓడిపోవడం సోనియా, రాహుల్ కు మింగుడు పడలేదు. ఇప్పుడు గతం గత: అంటూ రాబోయే ఎన్నికల్లోపార్టీని విజయ పథంలోనడపడానికి సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని రాష్ట్ర నేతలకు ఇప్పటికే హైకమాండ్ దిశా నిర్దేశం చేసింది. ఎంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి తెరాసలోకి వెళ్లినా క్యాడర్ ను కాపాడుకోవాలనేది నాయకులకు హైకమాండ్ ఆదేశం. అందుకే, క్యాడర్ డీలా పడకుండా తరచూ ఏదో ఒక కార్యక్రమం, నిరసన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాహుల్ పర్యటన వల్ల క్యాడర్ లో మరింత జోష్ వస్తుందని ఉత్తం తదితర నేతలు ఆశాభావంతో ఉన్నారు.