కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాహుల్ గాంధీ తొలిసారి ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నారు. కర్నూలులో మంగళవారం జరగబోతున్న బహిరంగ సభకు హాజరౌతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నేతలు ఏర్పాట్లలో ఉన్నారు. రాహుల్ సభకు లక్షమందిని సమీకరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర నేతలు కృషి చేస్తున్నారు. మరి, కర్నూలు సభకి ఎంతమంది హాజరౌతారో చూడాలి. ఇంకోటి, ఈ సభ ద్వారా ‘ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వగలిగేది మేమే’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా రాహుల్ తీసుకెళ్తారని ఏపీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఇప్పటికే ప్రజల్లో చాలా మార్పు వచ్చిందనీ, కేంద్రం నుంచి ఏపీకి న్యాయం జరగాలంటే… అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలనే నమ్మకం ప్రజల్లో పెరుగుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అంటున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమనీ, సంజీవని కాదనీ, అవసరం లేదని ఎంతమంది అంటున్నా.. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సజీవంగా ఉంచిందన్నారు. ఈ పోరాటాన్ని రాష్ట్ర అజెండాగా మార్చామనీ, ఇప్పుడది జాతీయ అజెండాగా కాంగ్రెస్ తీసుకుందనీ, చివరికి విదేశీ పర్యటనలకు వెళ్లిన సందర్భంగా కూడా భారతదేశం ఆంధ్రప్రదేశ్ కి రుణపడి ఉందని రాహుల్ చాటి చెప్పారన్నారు. ఏపీ విషయంలో కాంగ్రెస్ కు ఉన్న చిత్తశుద్ధి ఇంతకంటే ఏముంటుందనీ, రాష్ట్రానికి వస్తున్న రాహుల్ రైతుల్లో యువతలో అన్ని వర్గాల ప్రజల్లో భరోసా నింపుతారని రఘువీరా అన్నారు.
నిజానికి, ఈ సభను దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం ఏపీ కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి ఉందా అనే అనుమానాలున్నాయి. అయితే, కాంగ్రెస్ పై సానూకూల దృక్పథం ఈ మధ్య ఏపీలో కొంత పెరిగిందని చెప్పొచ్చు. అలాగని, అది కాంగ్రెస్ ప్రయత్నం ఫలితంగానూ చెప్పలేం! ఆంధ్రాని భాజపా అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేస్తుండటంతో… ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యేక హోదా అంశమై రాహుల్ ఈ మధ్య సానుకూలంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు కేవలం ఈ సెంటిమెంట్ పునాదులపైనే పార్టీని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ నేతలు గుర్తించాల్సిన మరో అంశం ఏంటంటే… రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, లేదా రాష్ట్రంలో బలపడితే ఏపీకి మేలు జరుగుతుందని ప్రజలు అనుకోవడం లేదు! కేంద్రంలో భాజపాకి ప్రత్యామ్నాయ శక్తి ఒకటి అధికారంలోకి రావాలన్నది ఏపీ ప్రజల కోరిక. ఈ చిన్న తేడాను గుర్తించి… హోదా సెంటిమెంట్ తో ప్రజలను రాహుల్ ఏ మేరకు ఆకర్షిస్తారో వేచి చూడాలి.