నాలుగు నెలల కిందట రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు అనర్హతా వేటు వేసింది. అదేమైనా పెద్ద నేరమా అంటే.. రాజకీయ నాయకులంతా అంత కన్నా ఘోరంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. విమర్శించుకుంటూనే ఉన్నారు. మరి రాహుల్ ఒక్కడికే శిక్ష ఎందుకు ? అనే అభిప్రాయం అంతటా వినిపించింది. అదే సమయంలో కోర్టు తీర్పుపైనా చర్చలు జరిగాయి. పరువు నష్టం కేసులో గరిష్ట తీర్పును సూరత్ కోర్టు జడ్జి ఇచ్చారు.
హైకోర్టులోనూ ఊరట లభించలేదు. పైగా గుజరాత్ హైకోర్టు రాహల్ పిటిషన్ తోసి పుచ్చడానికి చెప్పిన కారణాలు కూడా న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. చివరికి రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సి వచ్చింది. ఈ మేరకు సోమవారం నుంచి ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా..ఈ ఎపిసోడ్లో బీజేపీ ఏం సాధించిందనేది మాత్రం ఎవరికీ అర్థం కాదు. అలా కోర్టులో శిక్ష పడగానే ఇలా లోక్ సభ సభ్యునిగా అనర్హతా వేటు వేయడం.. వెంటనే ఇళ్లు ఖాళీ చేయించడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి వచ్చింది.
ఇప్పుడు రాహుల్ గాంధీ.. తన పదవిని తాను దక్కించుకున్నారు. పార్లమెంట్ కు వెళ్తున్నారు. కానీ దేశంలో ప్రజలు ఆందోళన చెందేలా వ్యవస్థల్ని దిగజారుస్తున్నారన్న ఓ భావన ప్రజల్లో పెరిగిపోవడానికి కారణం అయింది. ఇది ఖచ్చితంగా బీజేపీకి మైనస్ అవుతుంది. రాహుల్ గాంధీ తన పదవి పోయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోరాడటం ఆయన ఇమేజ్ పెంచేదే.