ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి రెండు నెలలు ‘రాజకీయ శలవు’ తీసుకొని విదేశాలకు వెళ్ళినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా ముందుకు నడిపించాలో ఆలోచించేందుకే విదేశాలు వెళ్ళారని కాంగ్రెస్ అధిష్టానం చెప్పుకోవడంతో ఆయన, పార్టీ కూడా నవ్వులపాలయ్యారు. పార్టీ గురించి ఆలోచించదలిస్తే పార్టీలో సీనియర్ నేతలతో సమావేశమయ్యి ఆలోచించాలి కానీ విదేశాలకు వెళ్లి ఆయన ఒక్కరూ ఒంటరిగా ఏమి ఆలోచిస్తారో? అని అందరూ నవ్వుకొన్నారు. కానీ ఆయన పార్టీ అధ్యక్ష పదవి చేప్పట్టాలనుకొన్నప్పుడు పార్టీలో సీనియర్ నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పార్టీ మీద అలిగి విదేశాలకు వెళ్లిపోయారని ఆ పార్టీ నేతలే చెప్పుకొన్నారు.
తిరిగి వచ్చిన తరువాత ఆయన పార్టీ అధ్యక్ష పదవి చేపడుతారని అందరూ అనుకొన్నారు. కానీ మళ్ళీ ఎందుకో వెనుకాడారు. బహుశః వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినట్లయితే ఆ అపకీర్తి ఆయనకు అంటుకొంటుందేమోననే భయంతోనే ఆయనను దూరంగా ఉంచి ఉండవచ్చును. కానీ ఎన్నికలలో గెలుపోటములు సహజమని చెప్పే కాంగ్రెస్ నేతలు, వాటికి భయపడే వ్యక్తి తమకు ఏవిధంగా మార్గదర్శనం చేయగలడు? అని ఆలోచించడం లేదు.
ఇక అసలు విషయం ఏమిటంటే రాహుల్ గాంధి మళ్ళీ యూరోప్ దేశాలకు బయలుదేరుతున్నారు. ఈసారి తన విదేశీ పర్యటన గురించి ఆయనే స్వయంగా ప్రకటించడంతో కాంగ్రెస్ అధిష్టానం గుండెల మీద నుండి పెద్ద భారం దింపినట్లయింది. ఒకవేళ ఆయన చెప్పకుండా యూరోప్ వెళ్లిపోయుంటే మీడియాకి అందుకు కారాణాలు, సంజాయిషీలు చెప్పుకోలేక కాంగ్రెస్ అధిష్టానం సతమతమవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా తను యూరోప్ వెళుతున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు తప్ప ఏపని మీద వెళుతున్నారు? ఎక్కడికి వెళుతున్నారు వంటి వివరాలేవీ ఆయన చెప్పలేదు. బహుశః విదేశాలలో నూతన సవత్సరం వేడుకలు జరుపుకోవడానికి వెళుతున్నారేమో? నా హృదయం నిరుపేద భారతీయుల కోసం పరితపించిపోతోంది అని చెప్పుకొనే రాహుల్ గాంధీ తన మాటలను ఆచరణలో పెట్టి నూతన సంవత్సర వేడుకలను నిరుపేద ప్రజలతో కలిసి చేసుకొంటే అందరూ హర్షించేవారు. కానీ విదేశాలకు వెళ్లి లక్షలో కోట్లో ఖర్చుపెట్టి వేడుకలు చేసుకొని వస్తుంటారు.