వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన రాజకీయ విధానాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. ప్రత్యేకహోదా ఇస్తానంటే.. రాహుల్ గాంధీకి అయినా మద్దతిస్తానని.. జగన్మోహన్ రెడ్డి నిర్మోహమాటంగా ప్రకటించారు. అయితే.. ఎన్నికల తర్వాతే… నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే కాంక్లేవ్‌లో .. పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి.. యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి జాతీయ రాజకీయాల్లో తాము న్యూట్రల్‌గా ఉన్నామని… ఎన్నికల ఫలితాల తర్వాత ప్రత్యేకహోదా ఇస్తానంటే… కాంగ్రెస్ పార్టీకి.. రాహుల్ గాంధీకి అయినా మద్దతివ్వడానికి సిద్ధమేనని ప్రకటించారు. రాహుల్ గాంధీకి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకు ప్రత్యేకంగా ఎలాంటి విబేధాలు లేవని.. తన లక్ష్యం ప్రత్యేకహోదా సాధించాడనికేనని ఆయన చెప్పుకొచ్చారు.
ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి … కాంగ్రెస్ విషయంలో.. ఒకే ఒక్క విధానంతో ఉండేవారు. తీవ్రంగా వ్యతిరేకించేవారు. రాహుల్ గాంధీపై నమ్మకం లేదని చెప్పేవారు. ఢిల్లీ రాజకీయాల్లో నరేంద్రమోడీ.. ప్రత్యేకహోదా ఇవ్వబోమని ఘంటాపథంగా చెప్పినా.. బీజేపీ నేతలతోనే .. వైసీపీ నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకహోదా ఇస్తామన్నా.. ఆ పార్టీపై నమ్మకం లేదని. పదే పదే జాతీయ చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చారు. నిన్నామొన్నటి వరకూ… ఇదే వాదన వినిపించారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చారు. మోడీ ఎంతో… రాహుల్ గాంధీ కూడా అంతేనని చెప్పుకు రావడం ప్రారంభించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. ఇంత వరకూ కేసుల భయంతో.. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన మాటలు దీన్ని ధృవీకరించేలా ఉన్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం.. పరిగణనలోకి తీసుకోకుండా.. తీవ్రంగా విమర్శలు.. చేసి ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్‌పై నమ్మకం లేదని చెప్పిన ఆయన… అవసరం అయితే.. కాంగ్రెస్ పార్టీకి అయినా ప్రత్యేకహోదా అయినా… ఇస్తే మద్దతిస్తామని చెప్పుకొస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పుల నేపధ్యంలో… ఎందుకైనా మంచిదని… జగన్.. కాంగ్రెస్ పార్టీ వైపు సానుకూలంగా మాట్లాడుతున్నారన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.