ఇండియన్ పాలిటిక్స్‌లో ఈ దశాబ్ధపు అత్యుత్తమ కమెడియన్ అవార్డ్ కొట్టేయడానికి అహర్నిశలూ కష్టపడుతూ ఉంటాడు రాహుల్ గాంధీ. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ మొన్న మొన్నటివరకూ కేవలం పార్టీ అభ్యర్థులను, అగ్రనేతలనే కమెడియన్స్‌ని చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడిక మోడీకి ప్రత్యర్థులుగా ఉన్న అందరినీ కమెడియన్స్‌గా జనం ముందు నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలేవో చేస్తున్నట్టుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకముందు వరకూ అఖిలేష్ యాదవ్ హీరోగానే ఉన్నాడు. ముఖ్యంగా తండ్రి, బాబాయ్‌లతో అఖిలేష్ చేసిన పోరాటం యూపీ యువతకు నచ్చింది. ఆ హీరోయిజం చూసే ఎస్పీ ఎమ్మెల్యేలు కూడా అఖిలేష్‌కి మద్ధతుగా నిలబడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీకి వందకు పైగా సీట్లు కేటాయించడంతోనే ఎస్పీ గెలుపుపైన బోలెడన్ని సందేహాలు క్రియేట్ అయ్యాయి. అదే విషయాన్ని ములాయం సింగ్ యాదవ్ కూడా పరోక్షంగా చెప్పాడు. కానీ అఖిలేష్ యాదవ్ మాత్రం మాది యువ జోడి అంటూ బరిలోకి దిగాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో అఖిలేష్ ఒక్కడికే ఎన్నికల గోదారి ఈదడం చాలా కష్టమైపోయింది. ఇక రాహుల్ గాంధీ లాంటి కమెడియన్ని వీపున కట్టుకుని ఈదడం అఖిలేష్ వళ్ళ కాలేదు. ఎస్పీ ఓటమికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ రాహుల్ గాంధీతో పొత్తు వళ్ళ వచ్చిన బలహీనతలు కూడా ప్రధాన కారణమయ్యాయి.
రాహుల్ గాంధీ ప్రచారం మొదలెట్టిన వెంటనే బిజెపి నాయకులందరూ కూడా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటూ ఇద్దరినీ పోలుస్తూ ప్రచారం చేశారు. కొబ్బరి బోండాల కామెడీ సహా రాహుల్ ప్రచారం అంతా కూడా కామెడీగానే సాగింది. మధ్యలో ప్రియాంక గాంధీని రంగంలోకి దింపడం కూడా రాహుల్ అసమర్థతను చాటి చెప్పినట్టైంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ అయితే రాహుల్‌ని చిన్నపిల్లాడనేసి గాలి తీసేసింది. తన హీరోయిజాన్ని జనాలు గుర్తించేలా చేయడం కో్సమే అపసోపాలు పడుతున్న అఖిలేష్ యాదవ్‌కి రాహుల్ గాంధీని కూడా యూపీ ఓటర్లకు హీరోగా చూపించడం ఎలాగో సాధ్యం కాలేదు. గతంలో అయితే గాంధీ తోక ఉన్న ఏ నాయకుడు వచ్చినా ఓటర్లలో సూపర్ క్రేజ్ ఉండేది. కానీ ఆ క్రేజ్‌ని అడ్డుపెట్టుకుని గాంధీ తోక ఉన్న వారసులందరూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడం, అధికార మదంతో ముఖ్యమంత్రి స్థాయి నాయకులను కూడా అగౌరవపరచడం లాంటివి చేయడంతో ఇప్పుడు ఈ తరం వారసులు అంటేనే చాలా మంది ప్రజలకు ఒళ్ళు మండుతోంది. బీహార్‌లో కూడా నితీష్ కుమార్‌ని ముఖ్యమంత్రిగా కోరుకున్నారు కాబట్టే కూటమిని గెలిపించారు బీహారీలు. ఆ విషయం తెలుసుకోకుండా రాహుల్‌గాంధీతో కలిసి బీహార్ మేజిక్‌ని రిపీట్ చేద్దామనుకున్న అఖిలేష్ యాదవ్ అంచనాలన్నీ పూర్తిగా మటాష్ అయ్యాయి. రాహుల్ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ నియోజకవర్గ పరిథిలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది అంటే రాహుల్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి మోడీ-అమిత్ షాల అసామాన్య జోడీని ఢీకొట్టడానికి రాహుల్ లాంటి కామెడీ నాయకుడిని వెంటేసుకుని బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ బొక్కా బోర్లా పడ్డాడు. రాహుల్‌ని ఒక ఆట ఆడుకుంటున్న నెటిజనులకు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా అడ్డంగా దొరికిపోయాడు. వీళ్ళిద్దరినీ కమెడియన్స్‌ని చేస్తూ నెట్లో పేలుతున్న జోకులు అయితే మామూలుగా లేవు. రాహుల్ ఐరన్ లెగ్ మహిమ అఖిలేష్ యాదవ్‌ని కూడా కమెడియన్ని చేసి పడేసింది అన్నదే జోక్ ఆఫ్ ద డే.