రాహుల్ గాంధీ కాంగ్రెస్ అద్యక్ష పీఠం అధిష్టించే ప్రక్రియ దాదాపు పూర్తయిపోయింది. ఇది లాంచనమేనని అందరికీ తెలుసు. ‘డిసెంబరు 31లోగా మీ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల’ని ఎన్నికల సంఘం తాఖీదు ఇచ్చిన దృష్ట్యా ఇంకా ఆలస్యానికి ఆస్కారమే లేదు. 2013లో ఎన్నికలకు ముందు ఉపాద్యక్ష పదవి చేపట్టిన రాహుల్ గాంధీ అప్పటి నుంచి నాయకత్వ పాత్ర బాగా పెంచినా ఇంకా సోనియాగాంధీ పేరు మీదే అన్నీ జరిగిపోతున్నాయి. గత సెప్టెంబరు 12న రాహుల్ అమెరికాలోని క్యాలిఫోర్నియా యూనివర్సిటీ సమావేశంలో మాట్లాడుతూ తాను నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి వెనకాడబోనని ప్రకటించారు. అద్యక్ష పదవి అలంకరించాల్సిందిగా మొన్న ఏడవ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయనను అభ్యర్థించింది. కొన్ని రాష్ట్ర పిసిసి లు కూడా ఆ మేరకు సిఫార్సులు పంపాయి. ఇంత కాలం నుంచి కుమారుడికి పగ్గాలు అప్పగించడం కోసమే ఆరోగ్యం బాగలేకపోయినా అద్యక్ష పీఠాన్ని కాపాడుతూ బాధ్యతలు నెట్టుకొస్తున్న సోనియా గాంధీ వూపిరి పీల్చుకోవచ్చన్నమాట. అయితే కాంగ్రెస్ కొత్త వూపిరి పోసుకోవడం ఏ మేరకు జరుగుతుందన్నది ఇక్కడ ప్రధాన సమస్య.
1885 డిసెంబర్ 28న ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్ దేశంలో అతి పెద్ద పురాతన రాజకీయ పార్టీ మాత్రమే గాక దాదాపు ఆరు దశాబ్దాలు దేశాన్ని పాలించిన పాలక వర్గ పార్టీ కూడా. కేంద్రంలో నలభై ఏళ్ల కిందట కాంగ్రెస్ గుత్తాధిపత్యం బద్దలైపోయింది. అది అనుసరించిన రాజకీయ ఆర్థిక విధానాలు, అవకాశవాద పోకడలు, అవినీతి కుంభకోణాలు, అత్యవసర పరిస్థితితో పరాకాష్టకు చేరిన అప్రజాస్వామిక పోకడలు… ఇవన్నీ ఆ పార్టీ ప్రభావాన్ని, పరిధిని కుదిస్తూ వచ్చాయి. స్వాతంత్య్రానంతరం ఏకొద్ది కాలమో మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలూ కూడా నెహ్రూ కుటుంబ వారసుల నాయకత్వంలోనే నడిచాయన్నది వాస్తవం. అయితే వారంతా రాజకీయ ప్రక్రియలో భాగం పంచుకుంటూ వచ్చారన్నది కూడా నిజం. ఆ కుటుంబం పైన వుంటేనే కాంగ్రెస్‌ను ఐక్యంగా వుంచగలదనే భావన ఏర్పడిపోయింది. అయితే వారెవరూ ఎకాఎకిన నాయకత్వాలు స్వీకరించకుండా క్రమపద్ధతిలో కీలక బాధ్యతల్లోకి రావడం ఒక వ్యూహంగా పెట్టుకున్నారు. నెహ్రూ వుండగానే ఇందిరాగాంధీ కాంగ్రెస్ అద్యక్షురాలైనప్పటికీ ఆయన మరణానంతరం మొదట లాల్ బహుదూర్ శాస్త్రిని ప్రధానిని చేసి ఆ తర్వాత ఆమెను గద్దెక్కించారు. ఆ రోజున ఆమెకు పోటీగా వున్న మొరార్జీ దేశాయి మితవాది, మొండి వారు గనక ఇందిర మెరుగని అప్పటి కాంగ్రెస్ అద్యక్షుడు కామరాజ్ తలపోశారు. అయితే తర్వాత ఆమె బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, సోవియట్‌తో స్నేహంగా వుండటం వంటి పనులు పాత మితవాదులకు నచ్చక కాంగ్రెస్ చీలిపోయింది. ఎమర్జన్సీ కాలంలో ఇందిర రెండవ కుమారుడైన సంజరు గాంధీ పెత్తనం చలాయించారు. వందిమాగధులు ‘ఇందిరే ఇండియా’ అన్నారు. తల్లీ కొడుకులే గాక వారి చుట్టూ చేరిన వారి అకృత్యాలు ప్రజాగ్రహానికి కారణమైనాయి. 1977లో ఇందిరను ప్రజలు ఓడించిన దశలో…మిగిలిన నాయకులు చాలా వరకూ దూరం కాగా…ఆ బృందమే ఆమెతో నిలబడి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడింది. అందుకే 1980 తర్వాత ఇందిరాగాంధీ పార్టీ అద్యక్ష బాధ్యతలు కూడా తనే చేపట్టి ద్వంద్వ నాయకత్వ కేంద్రాలు లేకుండా చేశారు. సంజరు గాంధీ ప్రమాదంలో మరణించాక రాజీవ్‌గాంధీ రంగ ప్రవేశం చేసి ఎం.పి గా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్నారు. 1984 అక్టోబరు 31న ఇందిర దారుణ హత్య తర్వాత ప్రధానిగా పార్టీ అద్యక్షుడుగా మారి 1984 చివరలో సానుభూతి నేపథ్యంలో ఎన్నికల్లో 400 స్థానాలు గెలిచి కనీవినీ ఎరుగని విజయం సాధించారు. 1991 ఎన్నికల ప్రచారం మధ్యలో రాజీవ్ హత్య. పివి నరసింహారావు నాయకత్వం- ఓటమి ఆయనను తప్పించేందుకు సీతారామ్ కేసరిని కొద్ది కాలం అద్యక్షుడుగా వూరేగించి, ఇరవయ్యేళ్ల కిందట 1997లో సోనియా అద్యక్ష బాధ్యతలు తీసుకుని అత్యధిక కాలం కొనసాగుతుండడం మరో ఘట్టం.
రెండు యుపిఎల పేరిట పదేళ్ల పాటు కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్రంలో పాలన సాగడం సోనియా నాయకత్వాన్ని సఫలం చేసింది. . తన తలిదండ్రులతో పోలిస్తే రాహుల్ ప్రత్యక్ష నాయకత్వం చేపట్టడానికి ఎక్కువ కాలం తీసుకోవడమే గాక భిన్న సంకేతాలు ఇస్తూ వచ్చారు. బిజెపి తెలివిగా2014 ఎన్నికలను రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్టు చిత్రించే ప్రయత్నం చేసింది. అప్పటికే అప్రతిష్టలో అడుగంటిన కాంగ్రెస్ ఎన్నడూ లేనంత తక్కువకు 44 లోక్‌సభ స్థానాలకు పడిపోయి నరేంద్ర మోడీ నాయకత్వంలో మొదటిసారి కేంద్రంలో బిజెపి మెజార్టీ సాధించింది. ఆ వెంటనే రాహుల్ మాట్లాడుతూ సరైన నాయకత్వం లేకపోవడం ఈ ఓటమికి కారణమన్నారు. కాని బిజెపి ప్రభుత్వ విధానాలు, అసహన రాజకీయాలపై పోరాడే బదులు తటపటాయింపులకు అవకాశమిచ్చారు. ఒక దశలో చెప్పాపెట్టకుండా మాయమైపోవడం దేశ రాజకీయాల్లోనే ఎరుగని పరిణామం. ఆ దశలో ఆయనేదో శిక్షణ తీసుకున్నారని తర్వాత సమర్థత పెరిగిందని ఒక ప్రచారం. ఇప్పుడు కాంగ్రెస్ కేవలం ఆరు చిన్న రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో వుంది.
ఇలాంటి తరుణంలో నాయకత్వం చేపడుతున్న రాహుల్ గాంధీ అస్తిత్వ సవాలునే ఎదుర్కోవలసి వుంటుంది. నోట్ల రద్దు తర్వాత ఆయన చొరవ కదలిక పెరిగిన మాట నిజం. దేశ విదేశీ గుత్తాధిపతులు కూడా మోడీ ఒక్కడినే నమ్ముకోవడం కన్నా రాహుల్‌ను కూడా అందుబాటులో వుంచుకోవడం అవసరమన్న అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే అమెరికా పర్యటనలో ఆయనకు చాలా ప్రచారమిచ్చారు. బహుశా గుజరాత్ ఎన్నికల ఫలితాలపై అంతగా నమ్మకం లేకపోవడం వల్లనే వాటికన్నా ముందే రాహుల్‌కు పట్టాభిషేకం పూర్తిచేస్తున్నారు. తర్వాత వారి పాలనలోని కర్ణాటక ఆ పిమ్మట కాంగ్రెస్ బిజెపిలే తలపడే రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘర్ వంటి రాస్ట్రాలలోనూ ఎన్నికలు జరుగుతాయి.వీటిలో ఏ మేరకు ఫలితాలు సాధించగలరన్నది రాహుల్ నాయకత్వానికి వచ్చే స్పందనకు సూచిక అవుతుంది.