నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులుగా పేర్కొనబడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఈనెల 19న జరిగే విచారణకు తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలసిందేనని డిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో, మోడీ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిన్న పార్లమెంటును స్తంభింపజేసింది. న్యాయవ్యవస్థపై తమకు 100 శాతం నమ్మకం ఉందని రాహుల్ గాంధి చెపుతునప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా వ్యవహరించడం చూస్తే వారికి న్యాయవ్యవస్థపై నమ్మకం లేనందునే కోర్టులో ఉన్న వ్యవహారాన్ని పార్లమెంటుకు ఈడ్చి రచ్చ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇక మరో విశేషం ఏమిటంటే, ఈనెల 19న వారిరువురూ పాటియాలా కోర్టులో జరిగే విచారణకు హాజరు అయ్యేటప్పుడు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు అందరూ కలిసి పాదయాత్ర చేస్తూ అక్కడికి చేరుకోవాలని తద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే, ఒకవేళ ఈ కేసులో కోర్టు వారిరువురికీ జైలు శిక్ష వేసినట్లయితే, సోనియా గాంధీ మాత్రం ముందస్తు బెయిలుకి దరఖాస్తు చేసుకొంటారు కానీ రాహుల్ గాంధి మాత్రం బెయిలు తీసుకోకుండా జైలుకే వెళ్లాలని నిశ్చయించుకొన్నారుట! జైలుకి వెళ్ళినట్లయితే దేశప్రజలకు తమపై సానుభూతి కలుగుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం తమను ఎంతగా వేదిస్తోందో నిరూపించినట్లు కూడా అవుతుందని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ ఈలోగానే కాంగ్రెస్ పార్టీ ఈ కేసును సుప్రీం కోర్టులో సవాలు చేయడానికి సిద్దమవుతోంది. ఒకవేళ సుప్రీం కోర్టు కూడా దిగువ కోర్టు తీర్పులనే సమర్ధిస్తే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందిపడక తప్పదు.
ఇదివరకు అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీపై కొన్ని అభ్యంతరకర ఆరోపణలు చేసినపుడు ఆయన పరువు నష్టం దావా వేశారు. అప్పుడు కేజ్రీవాల్ బెయిలు తీసుకొనే అవకాశం ఉన్నా తీసుకోకుండా ఇలాగే ఏదేదో అతిగా ఊహించేసుకొంటూ సుమారు రెండు వారాలు జైలులో గడిపారు. చివరికి కోర్టు మందలించడంతో బెయిలుకి దరఖాస్తు చేసుకొని జైలు నుండి బయటపడ్డారు. బహుశః రాహుల్ గాంధి వ్యవహారం కూడా అలాగే ముగుస్తుందేమో? అయినా దేశ ప్రజల దృష్టి ఆకర్షించడానికి, వారి సానుభూతి పొందడానికి ఇటువంటి వింత ఆలోచనలు చేయడం దేనికో అర్ధం కాదు. వారి శల్య సారధ్యంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, ఆ తరువాత వరుసగా వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని పతనం అంచుకు తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు తమపై వచ్చిన ఆరోపణలను దేశ సమస్యగా, పార్టీ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పరువు పూర్తిగా గంగలో కలిపేస్తున్నారని కొందరు కాంగ్రెస్ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.