ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేరు. తన తండ్రి ములాయం సింగ్ ని ప్రధానమంత్రిగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లయితే, తక్షణమే ఆ పార్టీతో పొత్తులకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంతే కాదు రాహుల్ గాంధికి ఉపాధ్యక్షుడు ప్రధాని పదవి కూడా ఇస్తామని మరో బంపర్ ఆఫర్ ఇచ్చేరు. దానిపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించలేదు. కానీ రాహుల్ గాంధి మొన్న బుదవారం అమేధీ పర్యటనకు వచ్చినప్పుడు స్పందించారు. 2017లో జరుగబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల కోసం తమ పార్టీ రాష్ట్రంలోని ఏ పార్టీతోనయినా పొత్తులు పెట్టుకోవడానికి సిద్దంగా ఉందని ప్రకటించారు. అంటే అఖిలేష్ యాదవ్ ఇచ్చిన ఆఫర్ ని ఆయన స్వీకరించినట్లే భావించవచ్చునేమో? అది అయన అసమర్ధతకి అద్దం పడుతోంది. ఆయనలో క్రమంగా ఆత్మవిశ్వాసం లోపిస్తోందని స్పష్టం చేస్తోంది.
ఒకప్పుడు తమ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి (ములాయం సింగ్ యాదవ్) క్రింద పనిచేయడానికి రాహుల్ గాంధి అంగీకరించకపోవచ్చును. కానీ సమాజ్ వాదీ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే అదే అర్ధం వస్తుంది. నిజానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి పుటినిల్లువంటిదని చెప్పవచ్చును. నెహ్రు, ఇందిరా గాంధీ మొదలుకొని అనేక మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి వచ్చినవారే. కనుక ఒకప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచి ఉండేది. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశం లేదు. అధికార సమాజ్ వాది, బహుజన సమాజ్ వాదీ పార్టీలదే అక్కడ పైచెయ్యిగా ఉంది. ఈ విషయం రాహుల్ గాంధి బాగానే గ్రహించినట్లున్నారు. అందుకే ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు ఇప్పటి నుంచే సిద్దమయిపోతున్నట్లున్నారు. తన గురించి తను చాలా అతిగా ఊహించుకొన్నప్పటికీ పార్టీ పరిస్థితిని రాహుల్ గాంధి సరిగానే అంచనా వేసినట్లు అర్ధమవుతోంది.