కామెడీ చేయాలంటే స్క్రీన్ పైనే చేయాలి. బయట.. అందులోనూ జనాలను బకరాల్ని చేయాలని చూసి, తద్వారా నవ్వుకుందామంటే.. ఆ తరవాత నవ్వుల పాలవ్వాల్సి వస్తుంది. ఈ విషయం తెలిసో.. తెలీకో.. రాహుల్ రామకృష్ణ ఓ ప్రాక్టికల్ జోక్ వేసి నవ్వుల పాలయ్యాడు.
శుక్రవారం రాత్రి… ఏ మూడ్‌లో ఉన్నాడో తెలీదు గానీ… `నేనిక సినిమాలు మానేస్తున్నా.. ఎవరేం అనుకుంటే నాకేంటి.. ఇదే నా నిర్ణయం` అంటూ వీరావేశంలో ట్వీట్ చేశాడు. దాన్ని కొంతమంది సీరియస్ గా తీసుకున్నారు. `అదేంటన్నా.. ఇలాంటి నిర్ణయం…. అంతా బాగానేఉంది కదా..` అంటూ సానుభూతి చూపించారు. `నీ నిర్ణయం మార్చుకో.. లేదంటే నామీద ఒట్టే` అంటూ… మరీ ఎమోషనల్ గా తీసుకున్నవాళ్లూ ఉన్నారు. ఓ తెలంగాణ అభిమాని అయితే… `కేసీఆర్ మీద ఒట్టు..` అంటూ ఇంకాస్త ముందుకెళ్లాడు. ఇంకొంతమంది మాత్రం `ఇది కూడా కామెడీయేనా.. ఏ వెబ్‌సిరీస్ కోసం` అంటూ సెటైర్లు వేశారు. మొత్తానికి రోజంతా.. సోషల్ మీడియాలో ఇదే చర్చ.
కానీ సాయింత్రం తీరిగ్గా.. `నేనెక్కడికి పోతా.. ఇక్కడే ఉంటా. ఇన్ని డబ్బులు, సుఖాన్ని ఇచ్చిన సినిమాని ఎలా వదులుతా.. జోక్ చేశా.. ఫూల్స్` అని ట్వీట్ చేశాడు. దాంతో ఈ ఎపిసోడ్ కి ముగింపు పలకాలనుకున్నాడు. కానీ జనాలు వదులారేంటి? ఈసారి మాత్రం యమ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. `నువ్వు జోకులేసుకోవడానికీ, బకరాలు చేసుకోవడానికీ మేమే దొరికామా` అంటూ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. దీనికంటే నువ్వు సినిమాల్లో మానేయడమే ఉత్తమం.. అంటూ సలహాలూ పరేస్తున్నారు. ఏదోజోక్ చేశా.. ఫ్రాంక్ చేశా.. అనడంలో తప్పులేదు. ఫూల్స్ అంటూ ఈ ట్వీట్‌ని నమ్మిన వాళ్లనందరినీ బకరాలు చేసేశాడు. అది మాత్రం దారుణమే. సినిమాలు చేయడం, చేయకపోవడం తన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే అంతిమంగా ఇది తన జీవితం దాన్ని అడ్డు పెట్టుకుని ఓ రోజంతా ఎమోషనల్ డ్రామా నడిపి, చివరకు ఫూల్స్ అనడం మాత్రం పిచ్చికి పరాకాష్ట.
దీని ద్వారా జనాల్ని నవ్వించాలనుకున్నాడా, లేదంటే కావాలని నవ్వుల పాలవ్వాలనుకున్నాడా..? ఇప్పటికైతే తానే ఫూల్ అయ్యాడు.