తొలి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా తొలి సినిమాకే జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. కానీ.. విధి ఎంత విచిత్రమో. అదే రోజున విడుదలైన రాహుల్ రవీంద్రన్ రెండో సినిమా `మన్మథుడు 2` రిజల్ట్.. ఆ ఆనందంపై నీళ్లు చల్లింది. చిలసౌ లాంటి ఓ క్లీన్ సినిమా తీసిన రాహుల్ ఈ స్థాయిలో అడల్ట్ కంటెంట్ చూపిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. బ్యాటింగు, తుపాకీ, లవణం.. ఇలాంటి పదాల్ని బూతుల రూపంలో వాడేశాడు. దాంతో.. తొలి సినిమాకి దక్కించుకున్న క్లీన్ ఇమేజ్ కాస్త ఈ సినిమాతో గంగపాలైంది.
చిలసౌలో రాహుల్ దర్శకత్వ ప్రతిభే కాదు, రచయితగా తన స్టామినా కూడా అర్థమయ్యేలా చేసింది. అయితే.. ఇవి రెండూ `మన్మథుడు 2`లో ఎటువైపుకు వెళ్లిపోయాయో అర్థం కావడం లేదు. మన్మథుడు 2 విషయంలో రాహుల్ని ఎవరో తప్పుదోవ పట్టించారని, అందుకే బూతు కామెడీ వైపు మొగ్గు చూపించాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగ్ ఏం చెబితే అది గుడ్డిగా ఫాలో అయ్యాడని, అందుకే రాహుల్ నుంచి ఇలాంటి ప్రోడెక్ట్ వచ్చిందని కూడా చెబుతున్నారు. మొత్తానికి తనపై పడిన ఈ బూతు ఇమేజ్ ని చెరిపివేసుకోవడం రాహుల్ ముందున్న కర్తవ్యం. అలా జరగాలంటే రాహుల్ చేతిలో మరో సినిమా పడాలి. మరి మన్మథుడు 2 చూసి కూడా తనకు అవకాశం ఇస్తారా, లేదా? అనేదే అతి పెద్ద ప్రశ్న.