లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సమంత ఇప్పుడు కేరాఫ్ అడ్రస్స్ అయిపోయింది. తను నటించిన ‘యశోద’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి వసూళ్లు బాగానే ఉన్నాయి. డిజిటల్, శాటిలైట్ వల్ల… ‘యశోద’ సేఫ్ ప్రాజెక్టుగా మిగిలిపోయిందని ట్రేడ్ వర్గాల టాక్. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలమ్’ త్వరలోనే విడుదల కాబోతోంది. ఇప్పుడు సమంత కోసం మరో లేడీ ఓరియెంటెడ్ కథ రెడీ అయిపోయిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్లో ఓ దర్శకుడు కూడా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. చిలసౌకి తనే దర్శకుడు. ఆ తరవాత నాగార్జునతో మన్మథుడు 2 రూపొందించాడు. ఆ సమయంలోనే ఓ లేడీ ఓరియెంటెడ్ కథని రెడీ చేసుకొన్నాడు. రష్మికకు కూడా ఓ నేరేషన్ ఇచ్చాడు. ‘మన్మథుడు 2’ హిట్టయితే… కచ్చితంగా ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లేదే. కానీ… ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రష్మిక ఆ ధైర్యం చేయలేదు. ఇప్పుడు రాహుల్ మళ్లీ ఆ కథని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలెట్టినట్టు టాక్. అయితే.. ఈసారి సమంతకు ఈ కథ చెప్పి ఒప్పిద్దాం అనుకొంటున్నాడట. సమంతకు రాహుల్ కీ మధ్య మంచి అనుబంధం ఉంది. రాహుల్ భార్య చిన్మయి.. చాలాకాలం వరకూ సమంతకు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఓ ఫ్యామిలీలా ఉంటారు. అందుకే రాహుల్‌కి ఇప్పుడు ఓ ఛాన్స్ ఇవ్వాలని సమంత భావిస్తోందట. అన్నీ కుదిరితే.. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ రూపొందించే అవకాశం ఉంది.