రాహుల్ గాంధి పౌరసత్వం గురించి భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి లేవనేత్తిన వివాదానికి రాహుల్ గాంధి నిన్న చాలా ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధి భారత్ తో పాటు బ్రిటిష్ పౌరసత్వం కూడా కలిగి ఉన్నారని స్వామి ఆరోపించిన నేపధ్యంలో దానిపై విచారణ జరిపించవలసిందిగా మహేష్ గిర్రి అనే భాజపా ఎంపి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ న్ని కోరారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ ఆమె పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి లేఖ వ్రాసారు. భాజపా సీనియర్ నేత లాల్ కృష్ణ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆ కమిటీ దీనిపై వివరణ ఇవ్వవలసిందిగా రాహుల్ గాంధిని కోరింది. దానికి ఆయన చాలా ఘాటుగా జవాబిచ్చేరు.
అసలు తానెప్పుడూ బ్రిటిష్ పౌరసత్వం కోరుతూ ఆ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేదని, అటువంటప్పుడు తనకు బ్రిటన్ పౌరసత్వం ఏవిధంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తనను అప్రదిష్ట పాలు చేసే ఉద్దేశ్యంతోనే సుబ్రహ్మణ్య స్వామి ఈ వివాదం సృష్టించారని రాహుల్ గాంధి ఆరోపించారు. ఆయన వద్ద తన బ్రిటిష్ పాస్ పోర్ట్, దాని నెంబరు వగైరా వివరాలున్నట్లయితే వాటిని ఆయన ఎందుకు బహిర్గతం చేయలేదని రాహుల్ గాంధి ప్రశ్నించారు. అటువంటి ప్రాధమిక వివరాలు ఏవీ తెలుసుకాకుండానే, ఎథిక్స్ కమిటీ పిర్యాధుని స్వీకరించడం, వివరణ కోరుతూ తనకు నోటీసులు పంపడం తప్పని రాహుల్ గాంధి అభిప్రాయం వ్యక్తం చేసారు. తనెప్పటికీ భారత పౌరుడిగా ఉండేందుకే ఇష్టపడతానని, తనకు ద్వంద పౌరసత్వం కలిగి ఉండాలనే కోరిక లేదని రాహుల్ గాంధి తన లేఖలో స్పష్టం చేసారు.