తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ అసెంబ్లీ సీట్ల పెంపుపై భారీ ఆశలే పెట్టుకున్నారు. దాన్ని నమ్ముకునే ఎడాపెడా ఫిరాయింపులూ ప్రోత్సహించేశారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో నియోజక వర్గాల పునర్విభజన బిల్లు వచ్చేస్తుందంటూ చాలా ధీమాగా ఉన్నారు. ఈ మధ్యనే, ఏపీ అధికార పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని చాలా ధీమాగా చెప్పేశారు! తనకు సమాచారం ఉందనీ, ఈ సమావేశాల్లోనే సీట్ల సంఖ్య బిల్లు వచ్చేస్తుంది కాబట్టి, సిద్ధంగా ఉండాలంటూ ఎంపీలకు సూచించారు. అయితే, ఇన్ని ఆశలు పెట్టుకుంటున్న సీట్ల పెంపు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తున్నప్పుడు కేంద్రం ఇచ్చిన ప్రధాన హామీల్లో ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఉన్నాయి! అయితే, ఈ రెండింటినీ సాధించుకోవడంలో చంద్రబాబు సర్కారు ప్రయత్నం లోపం ఉందనే విమర్శలు చాలానే ఉన్నాయి. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదాను పణంగా పెట్టారంటూ చంద్రబాబుపై విపక్షాలు ఇప్పటికీ విమర్శిస్తూనే ఉంటాయి. హోదాకు బదులు ప్యాకేజీ అంటూ కేంద్రం కూడా ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక, రైల్వే జోన్ విషయంలో ఇప్పటికీ నాన్చుడు ధోరణే కనిపిస్తోంది. ఈ రెండూ ఇలా ఉంటే… నియోజక వర్గాల సంఖ్య పెంపు విషయంలో మాత్రం కొంత కదలిక కనిపిస్తోంది. అయితే, ఈ సందర్భంలో రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే… స్పెషల్ స్టేటస్, రైల్వేజోన్ లాంటి హామీలను నెరవేర్చితేనే, బిల్లులో ఉన్న నియోజక వర్గాల పెంపు ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందనే మెలిక పెట్టడం!
విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింది. ఇప్పట్లో కోలుకునే సూచనలు కూడా కనిపించడం లేదు. తాజా ట్విస్ట్ ద్వారా ఏపీలో కాంగ్రెస్ కు కొంత మేలు జరిగే అవకాశం ఉందని రాహుల్ భావిస్తున్నారట. ఈ మెలిక పెట్టడం వల్ల ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరెత్తలేని పరిస్థితి వస్తుంది! ఎందుకంటే, ప్రత్యేక హోదా, రైల్వేజోన్ లను వద్దని జగన్ గానీ, చంద్రబాబుగానీ అనలేరు కదా! ఈ రెండూ కాదూ… నియోజక వర్గాల పెంపే ముద్దూ అని ఎవరు చెప్పినా, అది సదరు పార్టీకి తీవ్ర సమస్యలు తెచ్చిపెట్టే కామెంట్ అవుతుంది. అయితే, రాహుల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా ఇబ్బంది కలిగేది తెలుగుదేశం పార్టీకే! ఎందుకంటే, నియోజక వర్గాల సంఖ్య పెంపు విషయంలో మొదట్నుంచీ వైకాపా వ్యతిరేక ధోరణిలోనే ఉంది. పెంచితే టీడీపీకి మాత్రమే లాభిస్తుందన్నది వారి అంచనా. నిజానికి, సీట్ల సంఖ్య పెరగకపోతే ఇబ్బంది పడేది కూడా అధికార పార్టీనే! ఫిరాయింపుల పుణ్యమా అని ఇప్పటికే చాలాచోట్ల తమ్ముళ్లు వేరు కుంపట్లు రాజేసుకుని కూర్చున్నారు. జంప్ జిలానీలతోపాటు, పార్టీలో సీనియర్ నేతల్ని కూడా సమస్థాయిలో సంతృప్తిపరచాలంటే సీట్ల పెంపు ఒక్కటే టీడీపీ ముందున్న మార్గం. సో.. సంఖ్య పెరగకపోతే టీడీపీకి ఇబ్బందే.