రాఫెల్ ఒప్పందంలో అవకతవకలు ముమ్మాటికీ వాస్తవమనీ, నిజాలు కచ్చితంగా బయటకి వస్తాయన్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. రాఫెల్ డీల్ పై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. రాఫెల్ ధరల వివరాలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీయేసీ)కి కాగ్ అందించిందని సుప్రీం కోర్టు తీర్పులో వ్యాఖ్యానించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ధరల వివరాలు కాగ్ నివేదికలో ఉంటే… తన పక్కనే పీయేసీకీ ఛైర్మన్ మల్లికార్జున ఖర్గే ఉన్నారనీ, ఆయన ఇంతవరకూ అలాంటి నివేదికే చూడలేదన్నారు. పీయేసీ కమిటీలో కూడా వేరే ఎవ్వరికీ ఆ నివేదిక కనిపించలేదన్నారు. కానీ, సుప్రీం కోర్టుకి ఎలా కనిపించిందో అని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగ్ రిపోర్టు ఎక్కడుందనీ, దాన్ని ప్రజలకు చూపించాలనీ, కనీసం పీయేసీ ఛైర్మన్ కి అయినా ఒక కాపీ ఇవ్వండి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రధాని కార్యాలయంలో ఇంకో పీయేసీ ఉందేమో అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. ఫ్రాన్స్ పార్లమెంటులో ఆ నివేదిక ఇచ్చారేమో అంటూ వ్యంగ్యంగా అన్నారు. మోడీ ప్రభుత్వంలో ఇలాంటివి సాధ్యమే అన్నారు. ఇంతకీ ఇక్కడేం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదనీ, ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఒకటి చెబుతుందనీ, ఇంకోపక్క సుప్రీం కోర్టు ఇంకేదో చెబుతుందనీ, మరోపక్క నలుగురు ఛీఫ్ జస్టిస్ లు ఇంటికి వెళ్లిపోతారనీ అన్నారు. రాఫెల్ డీల్ లో రూ. 30 వేల కోట్ల చోరీ జరగడం వాస్తవమన్నారు. ఈ సొమ్ము రైతులూ పేదలదనీ, వాస్తవమేంటో దేశం మొత్తానికి తెలుసుననీ చౌకీదార్ చోర్ అన్నారు. తాము ఇది నిరూపించి తీరతామన్నారు.
‘మోడీజీ.. ఎంత దాచాలనుకుంటే అంత దాచుకోండి, ఎంతదూరం పరుగెత్తాలనుకుంటే పరుగెత్తండీ.. కానీ, మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేర’న్నారు. రాఫెల్ ఒప్పందం మీద పార్లమెంట్ విచారణ చేయిస్తుందనీ, జేపీసీ ఆ పని చేస్తుందనీ, ఆరోజున రెండు పేర్లు బయటకి వస్తాయనీ… ఒకటీ నరేంద్ర మోడీ, రెండోది అనిల్ అంబానీ అన్నారు. ఇదే ప్రెస్ మీట్ లో మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడారు. ఈ ఒప్పందం నివేదికకు సంబంధించి కాగ్ కి తెలీదనీ, కాగ్ దగ్గరే వివరాలు లేకపోతే పీయేసీ వరకూ వచ్చే ఆస్కారమే లేదన్నారు. ఒకవేళ పీయేసీ దగ్గరకి ఈ వివరాలొస్తే.. వాటిని తాము దాచి పెట్టాల్సిన అవసరం లేదనీ, పార్లమెంటులో ప్రవేశపెడతామనీ, ధరల రిపోర్టు వచ్చిందని కోర్టు తీర్పులో పేర్కోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మొత్తానికి, రాఫెల్ డీల్ విషయంలో సుప్రీం తీర్పు కాంగ్రెస్ కి ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించిందని భాజపా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో… ఈ కొత్త పాయింట్ తో ఎదురుదాడికి రాహుల్ దిగారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసలు లెక్కలు తేలుస్తామంటూ సవాలు చేశారు.