హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి నరేంద్ర మోడి ప్రభుత్వంపై మాటలదాడిని కొనసాగిస్తున్నారు. నరేంద్రమోడి సూటు-బూటు సర్కారులాగా కాక కాంగ్రెస్ వస్తే కుర్తా-పైజామా సర్కారులాగా ఉంటుందని చెప్పారు. తన నియోజకవర్గం అమేథిలో పర్యటిస్తున్న రాహుల్, అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, మోడి సూటు-బూటు ప్రభుత్వం క్రోనీ క్యాపటలిజంను ప్రోత్సహిస్తుందని, తమ ప్రభుత్వం అలాకాక కుర్తా, పైజామా, చెప్పులు ధరించే సామాన్యులను పట్టించుకుంటుందని అన్నారు. దేశప్రజలు నరేంద్రమోడి వాగ్దానాలలోని డొల్లతనాన్ని అర్థంచేసుకోవటం మొదలయిందని చెప్పారు. హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుందని అన్నారు. ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రానికి రు.1.5 లక్షలకోట్ల ప్యాకేజిని ప్రధాని ప్రకటించారని, మాజీ సైనికులు తమకు రావలసిన రు.8.,000 కోట్ల ప్యాకేజిని విడుదల చేయాలని ధర్నా చేస్తుంటేమాత్రం పట్టించుకోవటంలేదని ఆరోపించారు.
నల్లధనానికి ప్రతీకగా లలిత్ మోడిని తాము చూపిస్తున్నప్పటికీ, భారత్లో అవినీతి అంతమైపోయిందని నరేంద్ర మోడి ఉపన్యాసమిస్తున్నారని రాహుల్ అన్నారు. మరి ఆయన ఏ భారత్ గురించి మాట్లాడుతున్నారో అర్థంకావటంలేదని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్లో వ్యాపమ్, మహారాష్ట్రలో మరో కుంభకోణం, పరారీలో ఉన్న నేరస్తుడికి సుష్మా, వసుంధర సాయం చేయటం… మొదలైనవన్నీ జరుగుతున్నా దేశంలో అవినీతి తొలగిపోయిందని ప్రధాని చెబుతున్నారని అన్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపైనకూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. ఆర్థికాభివృద్ధిని బాగా కనిపించేలా చేయటంకోసం స్థూల జాతీయోత్పత్తి కొలిచే విధానాన్ని జైట్లీ మార్చేశారని ఆరోపించారు.