ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్యాయం చేసిందంటూ మొదలైన నిరసన ఇప్పుడు ఏకంగా అవిశ్వాస తీర్మానం వరకూ చేరుకుంటోంది..! నిజానికి, ఇదే అంశమై ఆంధ్రాలో గడచిన రెండ్రోజులుగా చర్చ జరుగుతోంది. కేంద్రం కేటాయింపుల లెక్కలు తేల్చుతామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ఓ కమిటీ వేశారు, దాని పని అది చేస్తోంది. ఇంకోపక్క, అధికార పార్టీ తెలుగుదేశం కూడా పార్లమెంటులో ఇప్పటికే ఒత్తిడి పెంచింది. దీంతోపాటు పార్లమెంటరీ కమిటీల చర్చల్లో కూడా ఆంధ్రా అంశాన్ని లేవదీయాలంటూ టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇక, వైకాపా కూడా నేరుగా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదుగానీ.. టీడీపీ సర్కారు లక్ష్యంగానే విమర్శలు చేస్తోంది. ఆంధ్రా ప్రయోజనాలపై విషయమై మోడీ సర్కారు మీద టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే, తాము మద్దతుగా నిలుస్తామంటూ జగన్ ప్రకటించారు. అయితే, ఇప్పుడీ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించడం విశేషం!
ఆంధ్రాలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ నేతలు అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఏపీ ప్రయోజనాలే ప్రధానాంశంగా చూపుతూ భాజపా సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైందని సమాచారం. ఏపీ కాంగ్రెస్ నేతల ప్రతిపాదించిన ఈ అంశంపై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్టు కథనాలు వస్తున్నాయి. విభజన సమస్యలపై కాంగ్రెస్ గళమెత్తాలనీ, 184వ నిబంధన కింద ఇప్పటికే కాంగ్రెస్ నోటీస్ ఇచ్చింది. అయితే, ఆ పార్టీకి సంఖ్యాబలం విషయమై కొంత ఇబ్బంది ఉంది కాబట్టి, ఇప్పుడీ అవిశ్వాస తీర్మానంపై కొంత చర్చనీయం అవుతోంది. కేంద్రంపై అవిశ్వాసానికి రాహుల్ సిద్ధమైనా.. ముందుగా యు.పి.ఎ. భాగస్వామ్య పక్షాలతో చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే, లోక్ సభలో అవిశ్వాసం పెట్టాలంటే కనీసం పది శాతం ఎంపీలు మద్దతు తెలుపుతూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కి ఆ సంఖ్య లోక్ సభలో లేదు కాబట్టి, భాగస్వాముల మద్దతును కూడగట్టాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు సమావేశాలు మార్చి 5న ప్రారంభమౌతాయి కదా. ఎలాగూ కొంత సమయం ఉంది. ఈలోగా భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.
నిజానికి, రాష్ట్ర విభజనతో ఆంధ్రాలో కాంగ్రెస్ కుదేలైంది. గడచిన నాలుగేళ్లలో ఏమాత్రం కోలుకున్న దాఖలాలే లేవు. అయితే, ఇప్పుడున్న పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. విభజన హామీలు సక్రమంగా అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనే సంకేతాలు ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. జాతీయ స్థాయిలో ఆంధ్రా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఒక అడుగుముందుకేసే ప్రయత్నంస్తోంది. ఈ నిర్ణయంపై తెలుగుదేశం స్పందన ఎలా ఉంటుందీ, వైకాపా స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.