తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులూ, అసమ్మతివాదులూ, ఆశావహులూ… ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్న సంగతి తెలిసిందే! అయితే, వీరిందరినీ ఎన్నికల్లోపు ఒక తాటిపైకి తీసుకుని రావడమే పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎప్పట్నుంచో సవాలుగా ఉంటోంది. కొంతమంది సీనియర్లు పీసీసీ పీఠం కావాలనీ, మరికొంతమంది తామే ముఖ్యమంత్రి అభ్యర్థులమనీ చెప్పుకుంటూ, ఉత్తమ్ పనితీరుపై ఎప్పటికప్పుడు హైకమాండ్ కు ఫిర్యాదులు చేయడం అనేది కొంతమంది టి. కాంగ్రెస్ నేతలకు ఒక రొటీన్ పని..! అయితే, తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చి వెళ్లిన తరువాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని సమాచారం. ఉత్తమ్ పై హైకమాండ్ కి ఫిర్యాదుల జోరు ఈ మధ్య బాగా తగ్గిందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.
రాహుల్ రాష్ట్రానికి వచ్చి, పార్టీలోని అసంతృప్త నేతల ఫిర్యాదులు వినడానికి పెద్దగా సమయం ఇవ్వకపోవడంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇకపై కమిటీల నిర్మాణం, అభ్యర్థుల ఎంపికకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఉత్తమ్ చూసుకుంటారని రాహుల్ చెప్పేసి వెళ్లిపోయారు. ఉత్తమ్ మీద కంప్లయింట్లు ఇచ్చేందుకు రాహుల్ ని కలిసినా… ఫిర్యాదులు వద్దు, సలహాలు ఉంటే చెప్పండని ఆయన కొంతమంది నేతలకు స్పష్టంగా చెప్పేశారట! దీంతో ఉత్తమ్ మీద గుర్రుగా ఉన్నవారికి రెండు విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు. అవేంటంటే.. ఒకటీ ఫిర్యాదులకు రాహుల్ కి ప్రాధాన్యత ఇవ్వరనేది, రెండోది రాష్ట్రంలో ఉత్తమ్ వెంట నడవాల్సిన అవసరం ఉందనేది..!
అంతేకాదు, రాహుల్ వచ్చి వెళ్లాక ఉత్తమ్ తీరులో కూడా కొంత మార్పు వచ్చిందంటున్నారు! సీనియర్ నేతలతో తరచూ మాట్లాడుతూ… వాళ్లని ఏదో ఒక పార్టీ కార్యక్రమంలో బిజీబిజీగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో ఫిర్యాదులు చేసేందుకు, గ్రూపులు కట్టేందుకు వారికి సమయం లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని వినిపిస్తోంది. మొత్తానికి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఉత్తమ్ కు ఈ విధంగా ఉపయోగపడిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. మరి, ఇదే పరిస్థితిని ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఉత్తమ్ నిలబెట్టుకుంటూ వెళ్లగలరా అనేదే ప్రశ్న..?