హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్న విద్యార్థులతో భేటీ అయ్యి వారికి సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు ఫేస్ బుక్ కామెంట్లతో మొదలైన వివాదాన్ని, తదనంతర పరిణామాలను రాహుల్కు వివరించారు. తర్వాత రాహుల్ రోహిత్ చిత్రపటానికి నివాళలు అర్పించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న రోహిత్ తల్లి, తమ్ముడు తదితర కుటుంబ సభ్యులను పరామర్శించారు. చాలాసేపు వారితో మాట్లాడారు. వి.హనుమంతరావు, ఉత్తమ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్, మల్లు భట్టి విక్రమార్క రాహుల్ పక్కనే ఉన్నారు.
ఈ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధి బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రాహుల్ కాన్వాయ్ రోడ్డుమార్గంలో సెంట్రల్ యూనివర్సిటీ చేరుకుంది. రాహుల్ పర్యటన సందర్భంగా యూనివర్సిటీలో భారీ బందోబస్తు చేశారు.