తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని 42 మంది ప్రముఖుల్ని.. ఒకేసారి పిలిచిన ఆ పార్టీ అధ్యక్షుడు.. రాహుల్ గాంధీ…విడివిడిగానే అయినా.. అందరికీ.. ఒక విషయాన్ని మాత్రం సూటిగా చెప్పారంటున్నారు. కాంగ్రెస్‌లో అందరూ అనుకుటున్నట్లుగా.. ప్రజాస్వామ్యాన్ని ఎక్కువగా అనుభవించేసి… సొంత పార్టీ నాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా .. మీడియాకు ఎక్కితే మాత్రం… వివరణలు ఇచ్చుకునే అవకాశం కూడా ఉండదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. రాహుల్‌తో భేటీ తర్వాత బయటకు వచ్చిన ఉత్తమ్ సహా… ముఖ్యనేతలు ఇదే చెప్పారు. చివరికి.. ఉత్తమ్ అంటే.. ఇంతెత్తున లేచే.. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా.. ఇదే మాట చెప్పారు. ఏదైనా పార్టీ వేదిక మీదే మాట్లాడుకోవాలి కానీ.. మీడియాకు ఎక్కవద్దని రాహుల్ సూచించించారని చెప్పుకొచ్చారు. వాళ్లకు అది సూచనే కావొచ్చు కానీ… నిజంగా అది హెచ్చరిక అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ లైన్ దాటితే ఎంతటి వారినైనా పార్టీ నుంచి గెంటి వేయడం ఖాయం. పార్టీ ముఖ్యనేతలు అంటే పీసీసీ చీఫ్ ఇతర పెద్దలు చెప్పినట్లే నడుచుకోవాలి.. పదే పదే ఫిర్యాదులతో ఢిల్లీకి వస్తే.. అదే పెద్ద మైనస్ అవుతుంది. మూడు గంటల పాటు ప్రతి నేతతోనూ విడివిడిగా మాట్లాడిన రాహుల్.. తెలంగాణలో పార్టీ పరిస్థితి చాల మెరుగ్గా ఉందని.. కలసి కట్టుగా గెలుపు కోసం పని చేయాలని ఆదేశించారు. పార్టీ గీత ఎవరైనా దాటితే ఎంతటి సీనియర్ నాయకుడైనా సరే కఠిన చర్యలు తప్పవని నేరుగానే హెచ్చరించారంటున్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఫిర్యాదులతో ఏ ఒక్క నేత ఢిల్లీ రావొద్దని తేల్చి చెప్పారు.
రాహుల్ గాంధీ.. ఒకే రోజు మూడు గంటల పాటు… తెలంగాణకు కేటాయించడం.. ముఖ్యనేతలందర్నీ పిలిచి మాట్లాడటం.. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అంతే కాదు.. నేతలతో ఆయన మాట్లాడే తీరులో కూడా కాస్తంత మార్పు వచ్చింది. తమకే పదవులు కావాలన్నట్లుగా.. ఇతరుల్ని తీసేయాలన్నట్లుగా వ్యవహరిస్తూ.. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే… పార్టీ మారిపోతామని.. హెచ్చరించే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చాలా స్ట్రాంగ్‌గానే వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. అదే నిజమైతే.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక నోరు మెదపకపోవచ్చు. ఎందుకంటే.. వాళ్లకి ఇక బయట పార్టీల్లో ఇప్పుడు అవకాశాలు లేవు మరి..!