మహాత్మా గాంధీని ఆర్.ఎస్.ఎస్. హత్య చేసిందని ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ అన్నందుకు ఆయనపై ఆర్.ఎస్.ఎస్. సుప్రీం కోర్టులో పరువు నష్టం దావా వేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం ఆ కేసుని నిన్న విచారించి, రాహుల్ గాంధీ అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకు ఆయన క్షమాపణలు చెప్పుకోమని సూచించింది. ఒకవేళ రాహుల్ గాంధీ అందుకు అంగీకరించకపోతే పరువు నష్టం దావాని కొనసాగిస్తామని తెలిపింది.
సుప్రీం కోర్టు సూచనలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. “రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పరు. గాంధీ కుటుంబ సభ్యులు ఎన్నడూ ఎవరికీ క్షమాపణలు చెప్పలేదు,” అని మీడియాతో అన్నారు.
గాంధీ కుటుంబ సభ్యులు ఎన్నడూ ఎవరికీ క్షమాపణలు చెప్పలేదు కనుక రాహుల్ గాంధీ కూడా క్షమాపణలు చెప్పరు అని దిగ్విజయ్ సింగ్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. నెహ్రు అంతటి వ్యక్తి తన వల్ల ఎప్పుడైనా పొరపాటు జరిగినా, ఎవరైనా నొచ్చుకొన్నా సంకోచించకుండా క్షమాపణలు చెప్పిన సందర్భాలు కాంగ్రెస్ చరిత్ర తిరగేస్తే కనిపిస్తాయి. ఆయనతో పోలిస్తే రాహుల్ గాంధీ ఎంత? ఆవేశంలోనో లేదా రాజకీయ ఉద్దేశ్యంతోనో రాహుల్ గాంధీ వంటి రాజకీయ నేతలు అప్పుడప్పుడు నోరు జారడం సహజమే. అటువంటి పరిస్థితిలో క్షమాపణలు చెప్పుకొనో లేదా విచారం వ్యక్తం చేస్తున్నామనో చెప్పుకొని ఆ వివాదాల నుంచి బయటపడుతుంటారు. కానీ రాహుల్ గాంధీ పంతానికి పోయి గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తీసుకువెళుతున్నారని చెప్పకతప్పదు.
ఇప్పుడు సుప్రీం కోర్టులో క్షమాపణ చెప్పుకోవడం ఆయనకి అవమానంగానే అనిపించవచ్చు కానీ రేపు అదే కోర్టులో ఆర్.ఎస్.ఎస్.కి పరువునష్టం క్రింద బారీ మొత్తం చెల్లించవలసి వచ్చినప్పుడు కూడా క్షమాపణ చెప్పుకోక తప్పదు. అప్పుడు ఇంతకంటే చాలా ఎక్కువే అవమానం జరుగుతుంది. ఒకవేళ ఈ కేసు మరికొన్ని నెలలు సాగి సరిగ్గా పంజాబ్, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు తీర్పు వెలువడితే, కాంగ్రెస్ విజయవకాశాలని కూడా అది ప్రభావితం చేయవచ్చు. కనుక రాహుల్ గాంధీ పంతానికి పోకుండా క్షమాపణలు చెప్పుకొని బయటపడటం ఆయనకి కాంగ్రెస్ పార్టీకి కూడా మంచిది.