హమ్మయ్య.. ప్రత్యేక హోదాపై బాగా పోరాటం చేశాం. ఢిల్లీలో అదరగొట్టేశాం. అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ఇంకా చాలామంది వచ్చేశారు. బాగా మాట్లాడారు. చాలు… ఈ మాత్రం చాలు..! ఏపీ కాంగ్రెస్ నేతల ఉత్సాహం చూస్తుంటే ఇలానే ఉంది..! కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్ మీదే పెట్టేస్తారని కూడా చెప్పేశారు. ఇంకేం.. ఇంతకంటే చిత్తశుద్ధి ప్రదర్శన ఉంటుందా చెప్పండీ..! సరిగ్గా ఇలానే పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ధోరణి.
ప్రత్యేక హోదా కోసం ఎలాంటి త్యాగాలకైనా వెనకాడబోమని అన్నారు రఘువీరా. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద చీటింగ్ కేసు పెట్టామనీ, పార్లమెంటు ఆవరణలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం దెబ్బతిన్నదనీ, మనసులు గాయమయ్యాయనీ, దానికి ప్రతిగా ధీటైన సమాధానం చెప్పి వచ్చామని రఘువీరా చెప్పారు. రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న భాజపా, టీడీపీల మీద కూడా ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేసి వచ్చామన్నారు. రాష్ట్రంలో టీడీపీ పునాదులు కదులుతున్నానీ, టీడీపీ మంత్రుల రాజీనామాలూ డ్రామాలూ అంతా రాజకీయ లబ్ధి కోసమే అని ఆరోపించారు. కాంగ్రెస్సే దేశానికి దిక్కు అనీ, ఏపీకి న్యాయం చేయగలిగే పార్టీ తమదే అని చెప్పారు.
మోడీ మీద పార్లమెంటు ఆవరణలోనే కేసు, టీడీపీ భాజపాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు, రాహుల్ ప్రధాని అయితే హోదాపై తొలి సంతకం… ఇంతకంటే ఇంకేం పోరాటం చేయాలన్నట్టుగా రఘువీరా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేసేశాం కదా… ఇక తమ వంతు పోరాటం అయిపోయిందన్నట్టుగా, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమకు ఓట్లేసి గెలిపించడం ఒక్కటే తరువాయి అనే విధంగా ఆయన వైఖరి ఉంది. ఇదేనా త్యాగాలకైనా వెనకాడని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి..! ఆంధ్రాలో ఆదరణ కోల్పోయిన పార్టీకి నిజానికి ఇదో మంచి అవకాశం. చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం మరింత తీవ్రంగా పోరాటం చేస్తే మరోసారి ప్రజాదరణ చూరగొనే అవకాశం ఉంది. కానీ, రఘువీరా చెబుతున్నంత తీవ్రస్థాయిలో రాహుల్ గాంధీ కూడా ఏపీ సమస్యను సొంతం చేసుకోలేదనే చెప్పాలి. ఏదో, ఢిల్లీ వరకూ విషయం వచ్చింది కాబట్టి.. మాట్లాడకపోతే బాగోదేమో అన్నట్టుగా తూతూ మంత్రంగా మాట్లాడి వెళ్లిపోయారు. ఏపీ ప్రజల తరఫున రాహుల్ గాంధీ పోరాటానికి దిగితే పరిస్థితి మరోలా ఉండేది, రాజకీయంగా కాంగ్రెస్ కి కూడా మైలేజ్ వచ్చేది.