భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో రైడ్ సినిమా జరుగుతోంది. టెక్నాలజీ ఏమీ లేని సమయంలో ఐటీ అధికారులు ఓ రాజకీయనేత ఇంట్లో రోజుల తరబడి సోదాలు చేసి లెక్కలేనంత సొమ్మును పట్టుకోవడం రైడ్ సినిమా. ఇప్పుడు గ్రంధిశ్రీనివాస్ ఇంట్లోనూ అలాంటిదే జరుగుతోంది. ఇప్పటికి ఆయన ఇంట్లో ఐటీ అధికారులు ప్రవేశించి ఐదు రోజులు అవుతోంది.ఇంకా లెక్క పెట్టాల్సినవి ఉన్నాయన్నట్లుగా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
వైసీపీ హయాంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో ఒకరు గ్రంధి శ్రీనివాస్. వైసీపీ పెద్దల ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమైనా సాయం చేశారో లేకపోతే తాము కూడా ఓ చేయి వేశారో కానీ…మొత్తానికి ఆయన లెక్కలు తేల్చడం మాత్రం ఐటీ అధికారులకు చాలా సమయం పడుతోంది. బయటకు గ్రంధి శ్రీనివాస్ ఆక్వా బిజినెస్లో ఉన్నారు. ఇతర నిగూఢ వ్యాపారాల గురించి చాలా పుకార్లు ఉన్నాయి. ఏది నిజమో తెలియదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గంలో ఎవర్నీ వదకుండా వసూళ్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏమీ దొరక్కపోతే ఎక్కువ రోజులు సోదాలు చేయరు. ఏవో దొరికాయి కాబట్టే… రోజుల తరబడి సోదాలు నిర్వహిస్తున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. సంచలనాత్మక విషయాలు ఉన్నాయో లేవో తెలియదు. ఐటీ అధికారులు చిన్న లీక్ కూడా బయటకు రానివ్వడం లేదు. సోదాలు ముగిసిన తర్వాత చేసే అధికారిక ప్రకటన తర్వాతనే అసలు ఏం దొరికాయన్నది తెలుస్తుంది.