మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద చాలా కాలం పాటు పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ అనే ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేపట్టారు. దర్యాప్తు చేస్తున్న ఇన్‌కంట్యాక్స్ అధికారులా.. లేక మరో దర్యాప్తు సంస్థకు చెందిన వారా..అన్న క్లారిటీ లేదు. రాష్ట్ర పోలీసు అధికారులకు కూడా సమాచారం లేదు. భద్రతగా కూడా… సీఆర్పీఎఫ్ బలగాలను తెప్పించుకున్నారు. చాలా కాలం పాటు చంద్రబాబు వద్ద పీఏగా పని చేసినఆయన తర్వాత రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం జీఏడీలో స్టాటిస్టికల్ అధికారిగా ఉన్నారు.
విజయవాడ సిద్దార్ధనగర్‌లో ఉన్న ఇంట్లోతో పాటు ఆయనకు సంబంధించిన ఇళ్లలో కూడా.. ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అత్యంత రహస్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇంటి బయట దృశ్యాలను చిత్రీకరించడానికి కూడా భద్రతా సిబ్బంది అంగీకరించలేదు. మొదట.. అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారేమోనన్న ప్రచారం జరిగింది. కానీ తాము సోదాలు చేయడం లేదని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో అసలు పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై దాడులు చేసి సోదాలు చేస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థలన్న విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. సాధారణంగా అవినీతి పరమైన అంశాలు.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు.. అన్నీ ఏపీ ప్రభుత్వ పరిధిలోని ఏసీబీలోకే వస్తాయి.
కానీ.. ఇక్కడ రంగంలోకి దిగింది కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఏ అంశంపై ఇలా సోదాలు చేస్తున్నారన్నదానిపై చిన్న విషయం కూడా బయటకు రావడం లేదు. పెండ్యాల శ్రీనివాస్.. చంద్రబాబు దగ్గర పీఏగా పని చేయడం.. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యలో నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో… ఏదో రాజకీయ సంచలనం ఉండబోతోందన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. సోదాలపై సంబంధిత సంస్థ అధికారిక ప్రకటన చేస్తేనే కానీ క్లారిటీ రాదు.