నిప్పు లేనిదే పొగ రాదు. కానీ వచ్చిందంటున్నారు రైల్వే బోర్డు అధికారులు. విశాఖలో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదంటూ రైల్వే బోర్డు ఛైర్మన్ ఎకె మిట్టల్ స్వయంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణా రావుకి నిన్న చెప్పినట్లు ఈరోజు మీడియాలో వార్తలు వచ్చేయి. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కనుక ఓడిశా ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని, అయినా విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని మిట్టల్ చెప్పినట్లు వార్తలు వచ్చేయి. ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం.
కానీ ఆ వార్తలన్నీ నిజం కావని, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే బోర్డు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. తమ నివేదికను రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి పంపిన తరువాత ఆయన సలహా మేరకు కేంద్రప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకొంటుందని రైల్వే బోర్డు అధికారులు తెలిపారు.
అయితే రైల్వే బోర్డు ఛైర్మన్ ఎకె మిట్టల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణా రావుతో దీని గురించి చెప్పిన మాటలు వాస్తవం అవునా కాదా? కానట్లయితే ఇన్ని వివరాలు ఏవిధంగా పుట్టుకొచ్చాయి? అని ఆలోచిస్తే మీడియాలో వచ్చిన వార్తలు గాలిలో నుండి పుట్టించినవి కావని అర్ధమవుతుంది. గత రైల్వే బడ్జెట్ లో ఏపీకి రైల్వే జోన్ మంజూరు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటిస్తారని అందరూ చాలా ఆశగా ఎదురు చూసారు. కానీ బడ్జెట్ సమావేశాల తరువాత దానిపై ప్రకటన చేస్తారని మీడియాకి లీకులు ఇచ్చేరు. కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. తరువాత రైల్వే మంత్రి సురేష్ ప్రభు విశాఖపట్నం వచ్చినప్పుడు దీనిపై ప్రకటన చేస్తారని అందరూ ఆశగా ఎదురు చూసారు. కానీ అప్పుడూ చేయలేదు. ఏడాదిన్నర గడిచిపోయినా దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేటికీ ఆ ప్రతిపాదన పరిశీలనలోనే ఉందని నమ్మబలుకుతున్నారు. ఇదివరకు ప్రత్యేక హోదా అంశం కూడా కేంద్రం పరిశీలనలో ఉందని నమ్మబలుకుతూ చివరికి రాష్ట్ర ప్రజలకు మొండి చెయ్యి చూపించారు. బహుశః రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కూడా సరిగ్గా అదే టెక్నిక్ ప్రజల మీద ప్రయోగిస్తున్నట్లున్నారు. కానీ దాని వలన చివరికి తెదేపా, బీజేపీలే మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహిస్తే ప్రజలతో ఇటువంటి గేమ్స్ ఆడే సాహసం చేయరు.