ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నిన్న డిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను, ప్రధాని నరేంద్ర మోడిని వరుసగా కలిసి రాష్ట్ర పరిస్థితులు వారికి వివరించి రాష్ట్రానికి ఇచ్చిన హామీల సంగతి నల్లీ వారికి మరొకమారు గుర్తు చేసారు. వాటిలో మిగిలిన వాటి సంగతి ఎలాగున్నా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి అభ్యర్ధనను రైల్వే మంత్రి సురేష్ ప్రభు అంగీకరించారు. త్వరలో జరుగబోయే మంత్రిమండలి సమావేశంలో దానికి ఆమోదం తీసుకొన్న తరువాత అధికారికంగా దానిపై ఒక ప్రకటన చేస్తానని హామీ ఇచ్చారు.
గత 21నెలలుగా ఇటువంటి హామీలనే ఇచ్చేరు తప్ప ఇంతవరకు రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జానే తీవ్రంగా నష్టపోతుందని ఒడిషా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కనుక అధికారిక ప్రకటన వెలువడే వరకు దానిపై ఆశలు పెంచుకోవడం అనవసరమే. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసమే దువ్వాడ-విజయవాడ, విజయవాడ-గూడూరు మధ్య రైల్వే లైన్ వేయాలని గత రైల్వే బడ్జెట్ లోనే ప్రతిపాదించారు. ఆ పనులు ఇంతవరకు మొదలుపెట్టలేదు. వాటిని తక్షణమే మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి అభ్యర్ధనకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. కొత్త రైళ్ళు, రైల్వే లైన్ల కోసం చంద్రబాబు నాయుడు చేసిన మరికొన్ని ప్రతిపాదనలకు కూడా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని కేంద్రమంత్రి సుజన చౌదరి మీడియాకి తెలిపారు.