తెలంగాణ బీజేపీకి అసలు ఏమీ కలసి రావడం లేదు. ఓ ధర్నా పెట్టుకుందామన్నా..ఓ ఆందోళన చేద్దామని. చివరికి ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ నేతల సమావేశం పెట్టుకుందామన్నా కలసి రావడం లేదు. పార్టీలో అవసరం లేని అంతర్గత మార్పులతో పడిపోయిన హైప్ ఎక్కించుకుందామని అమిత్ షాను తీసుకొచ్చి… కేసీఆర్ పై నాలుగు విమర్శలు చేయిద్దామని ప్లాన్ చేసుకుంటూంటే. . ప్రతీ సారి అడ్డం పడుతోంది. ఇప్పుడు మరోసారి అదే వర్షం కారణంగా అమిత్ షా టూర్ రద్దయింది.
గత నెలలలో ఖమ్మంలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. కానీ గుజరాత్ కు తుపానొచ్చింది. దాంతో గుజరాత్ కు కష్టం వస్తూంటే తాను తెలంగాణకు ఎలా వస్తానని అమిత్ షా టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ సారి అమిత్ షా వస్తారు.. ఖమ్మమంలోనే సభ పెడతామని అప్పట్లో బండి సంజయ్ చీఫ్ గా సవాల్ చేశారు. సభకు చేసిన ఏర్పాట్ల ఖర్చు లెక్క తేలింది కానీ… సభ మాత్రం జరగలేదు. తర్వాత ఆయన పదవి ఊడిపోయింది. ఇప్పుడు ఖమ్మం సభ కాదు కానీ… కనీసం బీజేపీ కోర్ కమిటీకి అయినా దిశానిర్దేశం చేసి పోవాలని అమిత్ షా అనుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం శనివారం అమిత్ షా తెలంగాణకు రావాల్సి ఉంది. తెలంగాణలో వరదల పరిస్థితి భీకరంగా ఉన్నందున రాజకీయ కార్యక్రమాలు పెట్టుకోవడం మంచిది కాదని అమిత్ షా క్యాన్సిల్ చేసుకున్నారు. బీజేపీ నేతలంతా సైలెంట్ అయ్యారు. మనకే ఎందుకిలా జరుగుతోదంని… ముసుగుకప్పుకుని మథనపడుతున్నారు.