క్రికెట్టుకే కాదు సినిమాలకీ వరుణ గండం వుంటుంది. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలకు మ్యాచులు రద్దయిపోయినట్లు.. కుండపోత వర్షాలు, వరదలు సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావాన్ని చుపుతాయి. అందుకే వానకాలంలో కొత్త సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు కాస్త కాస్త జంకుతారు. నిజానికి ఈ ఆగస్ట్ ప్రారభంలోనే తెలుగు రాష్ట్రాల్లో ముసురుపట్టుకుంది. తెలంగాణలో అయితే వారం రోజులు పాటు సూర్యుడు కనిపించలేదు. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ కి ఆ ఎఫెక్ట్ ఉంటుందా? అనే అనుమానంలోనే సినిమాలు విడుదలయ్యాయి. అయితే లక్కీగా ఆ రెండు వారాలు వర్షాలు రాలేదు. అయినా ఆ సినిమాలకు జనాలు రాలేదు. అది వేరే విషయం.
కానీ ఆగస్ట్ చివరి వారంలో వచ్చిన నాని ‘సరిపోదా శనివారం’ వర్షం బారిన పడింది. రెండు తెలుగు రాష్ట్రలలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో అయితే వరదలు ముంచుకొచ్చాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రజలు ఎంటర్టైన్మెంట్ వైపు చూసే పరిస్థితి తక్కువ. నిజానికి ‘సరిపోదా శనివారం’కు మంచి రిపోర్ట్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో కొంచెం లెంత్ అయింది కానీ సినిమా మాత్రం బావుందనీ చూసిన వారంతా చెబుతున్నారు. థియేటర్ కి వచ్చి చూడాల్సిన సినిమా ఇది.
కానీ అనూహ్యంగా వర్షాలు, వరదలు పట్టుకున్నాయి. కలెక్షన్స్ బావున్నప్పటికీ వర్షాల కారణంగా చాలా చోట్ల ఫుట్ ఫాల్స్ తగ్గాయి. అయితే యూనిట్ మాత్రం తమది లాంగ్ రన్ వుండే సినిమా అని, ఈ వారం కాకపోయినా వచ్చే వారం రావాల్సిన ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్ కి వస్తారానే నమ్మకంగా వున్నారు. చాలా సినిమాలు భారీ వర్షాలలోనూ సంచలనాలు నమోదు చేశాయి. మరి నాని కూడా అలాంటి ట్రాక్ రికార్డ్ నెలకొల్పుతాడెమో చూడాలి.