పదమూడు జిల్లాలు వున్న ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది జిల్లాల్లో 35 మంది మనుషుల ప్రాణాల్నీ 600 పశువుల ప్రాణాల్నీ మింగేసిన వాయుగుండం శాంతించింది…చెరువుల్ని రోడ్లనీ తెంపేసి, చేతికి అందే పంటను ముంచేసి, బతుకులో కష్టాల్నీ, కొంతకాలం తేరుకోలేని నష్టాలనూ మిగిల్చి వాన వెలిసింది. నవంబరులో రెండు దఫాలుగా 9 నుంచి 12 వరకు,తిరిగి 15వ నుంచి 19వ తేదీ వరకూ కురిసిన భారీ వర్షాల వల్ల పంటలకు, కమ్యూనిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు జరిగిన నష్టం 3 వేలకోట్ల రూపాయల వరకూ వుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమికంగా అంచనా వేసింది.
నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంటలకు నష్టం జరిగింది. అనంతపురం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ స్వల్ప నష్టాలు ఉన్నాయి. భారీ వర్షాలకు 35 మంది చనిపోయారు., మొత్తం 2 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.. పంట నష్టం సుమారు రూ.1,250 కోట్లుగా అంచనా వేసినట్లు స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంటు వివరాలు చెబుతున్నాయి.
వేర్వేరు జిల్లాల్లో 550 చెరువులకు గండ్లు పడ్డాయి. 1,865 కిలో మీటర్ల పొడవున ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో జాతీయ రహదారికి 100 మీటర్ల పొడవున గండి పడి హైవేపై రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాలు 146 గ్రామాలను ముంచెత్తాయన్నారు. ఫలి తంగా 467 ఇళ్లకు పూర్తిగా, 2,029 ఇళ్లకు పాక్షికంగా నష్టం జరిగింది. 613 పశువులు మృతి చెందాయి. ప్రాధమిక అంచనాలను బట్టి ఒక్క నెల్లూరు జిల్లాలోనే 1,395 కోట్ల రూపాయల నష్టం జరిగింది.చిత్తూరు జిల్లాలో 818 కోట్ల రూపాయలు, కడప జిల్లాలో 319 కోట్ల రూపాయలు అనంతపురం జిల్లాలో 212 కోట్ల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో 177 కోట్ల రూపాయలు నష్టం వుంది.
జాతీయ విపత్తు నివారణ సంస్థ నిబంధనల ప్రకారం బాధితులకు 20 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, పంచదార, లీటరు పామోలిన్‌ను సరఫరా చేస్తున్నామని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వనున్నామని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 26 వేల మంది బాధితులకు 188 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని కూడా అందులో వివరించారు.
నష్ట నివారణ, పునరావాస, పునర్నిర్మాణాలకు ముందస్తుగా వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలని కేంద్రప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖలను ప్రధానికి, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు పంపారు.