హైదరాబాద్: ఒక వారంరోజులక్రితంవరకూ ఎండిపోయిఉన్న తిరుమల జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత మూడురోజులుగా కురిసిన వర్షాలతో జలాశయాలన్నింటిలోకి భారీ ఎత్తున నీరు వచ్చి చేరింది. జలాశయాలన్నీ ఇప్పుడు ఓవర్ ఫ్లో అవుతున్నాయని, గత దశాబ్దకాలంలో ఇలా జరగటం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. ఆకాశగంగ, పాపవినాశనం, కపిలతీర్థం, కుమారధార, పసుపుధార, గోగర్భం వంటి జలాశయాలన్నింటిలో వర్షాల ప్రభావంతో నీరు వచ్చి చేరింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ జలాశయాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటి సంక్షోభంనుంచి బయట పడేసినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో రానున్న వేసవి కాలంకోసం నీటి సంరక్షణ చర్యలను టీటీడీ అధికారులు వారం క్రితమే ప్రారంభించారు. అయితే వరుణుడు కరుణించటంతో మూడురోజులలో తిరుమల-తిరుపతి ప్రాంతంలో 30 సెం.మీ. వర్షపాతం కురిసింది. దీంతో కరవు తీరిపోయింది. వచ్చే ఏడాది వరకు దిగలులేకుండా పోయింది. టీడీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారు భక్తులను కరుణించి వర్షాలు కురిపించారని అన్నారు. మూడు నెలల క్రితం వర్షాలకోసం తాము నిర్వహించిన యాగంకూడా సత్ఫలితాలనిచ్చినట్లు కనబడుతోందని అన్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి వంటి ప్రాంతాలలోకూడా చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి.