వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి లో నిన్నటి భారీ వర్షాల కారణంగా దయనీయమైన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో కే కాకుండా జనరల్ వార్డ్ లో కి సైతం మురుగునీరు చేరి, రోగులు ఆ మురుగు నీటి తో నే సహవాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. రోగులతో పాటు వారికి సహాయం కోసం ఉన్న వారి బంధువులు సైతం ఆ మురుగు నీటిలో కూర్చోలేక నిలబడలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలబడడానికి స్థలం లేక నర్సులు ఆస్పత్రి బయటకు వచ్చి నిలబడ్డ పరిస్థితి. వైద్య సిబ్బంది సైతం మురుగు నీటి కారణంగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే కరోనా నివారణ కోసం ఏర్పాటు చేసిన పి పి ఈ కిట్లు వర్షపు నీటిలో కొట్టుకుపోవడం చూస్తుంటే ఆస్పత్రి ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అవగతమౌతుంది.
తమ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ అన్ని విషయాల్లో ఎంతో పురోగతి సాధించిందని డంబాలు పలుకుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పై నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు కురిపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న జలయజ్ఞం ఉస్మానియా ఆస్పత్రికి సైతం చేరిందని, ఇదేదో ఉస్మానియా డ్యాం లాగా ఉంది చూడండి అని అంటూ ప్రభుత్వానికి చురకలంటించారు నెటిజన్లు. దాదాపు అన్ని చానల్స్ ని టిఆర్ఎస్ ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ వేయకుండా చూస్తూ ఉండడంతో, టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయాలంటే సోషల్ మీడియా మాత్రమే మార్గం గా కనిపిస్తున్న నేపథ్యంలో, నెటిజన్లు చేస్తున్న ఈ విమర్శలు సెటైర్లు వైరల్ అవుతున్నాయి.
కరోనా కారణంగా యావత్ ప్రపంచం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి సారించిన ఈ సందర్భంలో ఉస్మానియా ఆసుపత్రిలో ఏర్పడ్డ ఈ పరిస్థితి పై ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఏవిధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.