మహా వృక్షం నీడన చిన్న చిన్న చెట్లు బతకలేవు. వాటిని గుర్తింపూ రాదు. రైనా పరిస్థితి కూడా అంతే. భారత క్రికెట్ జట్టులో నమ్మకమైన బ్యాట్స్‌మెన్, ఫీల్డర్, పార్ట్ టైమ్ బౌలర్ గా అద్భుతమైన సేవలు అందించినప్పుడూ రైనాని గుర్తించలేదు. ఇప్పుడు సైలెంట్ గా రిటైర్ అయిపోయినప్పుడూ ఎవరూ పట్టించుకోలేదు.
మిడిల్ ఆర్డర్ లో రైనా ఎన్నోసార్లు జట్టు విజయాల్లో కీలక పాత్రలు పోషించాడు. ధోనీ తో కలిసి మ్యాచ్‌ని విజయవంతంగా ఫినిష్ చేశాడు. ఛేజింగుల్లో రైనా సగటు 66కి పైమాటే. ధోనీ తరవాత… ఇంత సగటు ఉన్న భారతీయ బాట్స్మెన్ రైనానే. ఛేజింగుల్లో రైనా – ధోనీ కలిసి ప్రతీసారీ.. భారత్ గెలుపు తీరాలకు చేరేది. టీట్వంటీల్లో రైనా విజృంభించాడు. ఐపీఎల్ తో కలిపి319 మ్యాచ్‌లు ఆడిన రైనా8300 పరుగులు చేశాడు. ఈ ఫార్మెట్ లో భారత్ తరుపున తొలి అంతర్జాతీయ సెంచరీ చేసిన ఆటగాడు రైనానే. టెస్టు, వన్డే, టీ ట్వంటీ.. ఇలా మూడు ఫార్మెట్లలోనూ సెంచరీ చేసిన తొలి భారతీయుడు రైనానే. ఇక రైనా ఫీల్డింగ్ విన్యాసాలు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? భారత ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచాడు రైనా. `రైనాలో నన్ను నేను చూసుకుంటున్నా` అని ప్రఖ్యాత ఫీల్డర్ జాంటీ రోడ్స్ చెప్పడం.. రైనా స్థాయిని తెలుపుతుంది.
ధోనీ – రైనాలు మంచి స్నేహితులు. ధోనీ కెప్టెన్సీలో రైనాకి చాలా అవకాశాలొచ్చాయి. అటు ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ఆటగాడిగా ఎదిగాడు రైనా. సరిగ్గా ధోనీ రిటైర్మెంట్ రోజునే… ఆటకు స్వస్తి పలుకుతూ.. తమ స్నేహం ఎంత గొప్పదో చాటుకున్నాడు. ధోరీ రిటైర్మెంట్ సందడిలో.. రైనాని ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. తన సేవలేం తక్కువ కాదు. మైదానంలో ఉన్నప్పుడు నూటికి నూరు పాళ్లూ… గెలుపు కోసం పోరాడుతూ, తన ప్రతిభను వందకి వందశాతం ధారాదత్తం చేసే రైనా లాంటి ఆటగాళ్లని చూడడం చాలా అరుదు.