హైదరాబాద్: చెన్నై నగరంలో, తిరువళ్ళూర్, కాంచీపురం, కడలూర్ జిల్లాలలో ఇవాళ మళ్ళీ వర్షం కురుస్తోంది. దీనితో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు నీటమునిగిన ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నాయి. మరోవైపు చెన్నై విమానాశ్రయంలో డొమెస్టిక్ సర్వీసులు ఇవాళ ప్రారంభం అయ్యాయి. అటు రైల్వే సర్వీసులు కూడా మొదలయ్యాయి. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య 450కు చేరింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
దేశం నలు మూలలనుంచీ, ప్రపంచం నలుమూలలనుంచీ తమిళనాడు బాధితులకోసం భారీ స్థాయిలో సహాయక సామాగ్రి వస్తున్నప్పటికీ దానిని బాధితులకు చేరవేయటం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఇంకా చాలా ప్రాంతాలు నీటిలో మునిగి ఉండటంతో సహాయక బృందాలు బాధితుల దగ్గరకు వెళ్ళి సహాయక సామాగ్రిని అందించలేకపోతున్నాయి. మరోవైపు బయటనుంచి వస్తున్న వాలంటీర్లకు సహాయాన్ని ఎక్కడకెళ్ళి అందించాలో సూచించేవారు కనబడటంలేదు. ఒక నోడల్ ఏజెన్సీ ఏదీ లేకపోవటంతో సహాయక కార్యక్రమాలమధ్య సమన్వయం లేకుండా పోయింది. దీనితో సహాయక సామాగ్రి పంపిణీని రాజకీయనేతలు హైజాక్ చేసి తమ వర్గాలవారికి, తమ ఇష్టమొచ్చినవారికి చేరవేయటం వంటి అక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే వంద టన్నుల సహాయక సామాగ్రి తీసుకుని ఇండియన్ నేవీకి చెందిన రెండు నౌకలు, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సహ్యాద్రి ఇవాళ విశాఖపట్నంనుంచి చెన్నై చేరుకున్నాయి. ఈ సామాగ్రిలో 7 లక్షల వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి.
ఇక నీట మునిగిన ప్రాంతాల వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రేషన్ కార్డులు, సర్టిఫికెట్ల వంటి ముఖ్యమైన పత్రాలు, విలువైన వస్తువులు, బట్టలు నీళ్ళలో కొట్టుకుపోయాయి. చెన్నైలోని గ్రీమ్స్ రోడ్ ప్రాంతంలో ఒక వ్యక్తి, ఇంకా నీళ్ళలోనే మునిగి ఉన్న తమ ఇంట్లోనుంచి తమ రేషన్ కార్డ్, కూతురు సర్టిఫికెట్లను తీసుకురావటానికి వెళ్ళి ఆ నీళ్ళలోనే మునిగి చనిపోయాడు. ఈ సంఘటన చెన్నై నగరవాసులను మరింత కలచివేసింది. దీనిపై ప్రభుత్వాధికారులు, చెన్నై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్పందిస్తూ, పోయిన సర్టిఫికెట్లకు బదులుగా కొత్తవి ఇస్తామని, వాటిగురించి ఆందోళన చెందొద్దని ప్రకటించారు.