అప్పుడప్పుడూ అతి భారీవర్షాలు కురుస్తూ ఎల్లకాలమూ వర్షాలే వుండని పరిస్ధితి మరింత పెరుగుతుందని వాతావరణ మార్పుపై ఏర్పాటైన అంతర్జాతీయ కమిటీ – ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చెయింజ్ (ఐపీసీసీ) హెచ్చరిస్తోంది. వాననీటిని భూమిలో పునరావేశింపజేయడమనే వాటర్ రీచార్జింగ్ మాత్రమే ఇందుకు పరిష్కారం…ప్రత్యామ్నాయం. వర్షాలనుంచి భూగర్భజలాల మట్టాన్ని పెంచుకోడానికి మనిషి అనుభవాల నుంచీ, సమాజాల ఆలోచనల నుంచీ పుట్టుకొచ్చిన టెక్నాలజీలు తెరమరుగైపోవడం, ప్రభుత్వాలు విస్మరించడం ప్రస్తుత పరిస్ధితికి ముఖ్యకారణం. రైతు ఆత్మహత్యల మూలాల్లోకి వెళ్ళిన ప్రతీసారీ సాగునీటి లభ్యత కీలక అంశం అవుతోంది.
కొన్ని రోజుల పాటు నిదానంగా కురిసే వర్షాలవల్ల భూగర్భ జలాశయాల్లోకి వర్షపు నీరు క్రమంగా ఇంకుతుంది. అలాగాక అతి తక్కువ కాలంలో కుండపోతగా కురిసే భారీవానల వల్ల వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకేందుకు తగిన సమయం ఉండదు. పర్యవసానంగా భూగర్భ జలమట్టాలు అడుగంటి పోతాయి. హెచ్చు కాలంప వర్షాలు లేకపోతే రైతులు ఆరుతడి మీదగాక భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తారు. ఇందువల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే సమస్య మరింత తీవ్రమవుతుంది.
ఒక్క అనంతపురం జిల్లాలోనే పదేళ్ళుగా 4 లక్షల వ్యవసాయ బోర్లు ఎండిపోయాయి. కొత్తగా వేసిన వాటిలో 3 లక్షలబోర్లలో నీరురాలేదు. ఈ పరిస్ధితి రైతుని వలసకూలీగా, వలసకూలీని పరాయి నేలమీద యాచకునిగా మార్చేస్తోంది. లేదా ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది.
భూగర్భజలాల వాడకాన్ని క్రమబద్ధం చేయడానికి 1970 లో కేంద్ర జలవనరుల శాఖ ఒకచట్టాన్ని తెచ్చింది. ఆబాటలోనే అవిభక్త ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాలు చట్టాల్నిచేశాయి. వీటి ప్రకారం ఏప్రాంతంలో ఎంతెంత లోతువరకూ బోర్లు వేయవచ్చో స్ధానికుల ప్రాతినిధ్యం వున్న కమిటీలే నిర్ణయించాలి. కర్నాటకలో ద్రాక్షతోటల్నీ, రాజస్ధాన్ లో ఎర్రమిరపకాయల్నీ, మహారాష్ట్రలో చెరకునీ, ఆంధ్రప్రదేశ్ లో పొగాకునీ …ఇలా ఆయాప్రాంతాల్లో భారీగా నీరు తాగేసే వాణిజ్యపంటలకోసం పెద్దరైతులు చట్టప్రకారమే బోర్లువేసి నీరు తోడేస్తున్నారు. అయితే చిన్నచిన్న కమతాల రైతుల్లో 95 శాతం మందికి ఇలాంటి కమిటీ వుంటుందనే తెలియదు.ఈ కమిటీలు ఆచరణలో సిబ్బందికి లంచాలు తెచ్చిపెట్టే వనరులుగా మిగిలిపోయాయి. వర్షపు నీరు వృధా పోకుండా తమ నేలల్లోనే ఇంకేందుకు అనువుగా పొలాల చుట్టూ మడులు కట్టడం, ఏటవాలు నేలకీ సమతలం నేలకీ అడ్డుగోడ కట్టి చిన్న చిన్న వాటర్ స్టోరేజీలు ఏర్పాటు చేసుకోవడం నాలుగైదువందల సంవత్సరాలుగా అమలులో వున్నదే. ఫ్రెంచివారి సహకారంతో విజయనగర పాలకులు ఒక చెరువు నిండితే మరో చెరువుకి పారించే గొలుసుకట్టు పరిజ్ఞానాన్ని అమలుచేశారు. తెలంగాణాలో ఇపుడు అమలౌతున్న కాకతీయ మిషన్ ఇదే! ఒకప్పుడు చంద్రబాబు పిలుపు ఇచ్చిన ”ఇంకుడుగుంట” కాన్సెప్ట్ కూడా ఇదే!!
మహారాష్ట్రలోని కడవంచి ప్రాంతంలో 300 గ్రామాల ప్రజలు వర్షపు నీటిని సమర్థంగా సమీకరించి, అనావృష్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని లాభసాటిగా నిర్వహించగలిగారు. కర్ణాటకలోని బగల్కోట్ జిల్లా రైతాంగం వర్షపు నీటిని నిల్వ చేసేందుకు అనుకూలంగా తమ పొలాలను తీర్చిదిద్దుకున్నారు.
పొలాల్లో చిన్నచిన్న జలాశయాలు, చెక్ డ్యాం, కరకట్టల నిర్మాణం కోసం రైతుల్ని ఆలోచనల పరంగా, ఆర్ధికపరంగా ప్రోత్సహించవలసిన బాధ్యతలను స్వచ్ఛంద సంస్ధలు, ప్రభుత్వం తీసుకోవాలి. ఇందువల్ల భూగర్బ జలాశయాల్లో మరింత నీరు సమీకృతమవుతుంది. అదే సమయంలో భూగర్భ జలాల వినియోగం తగ్గుతుంది. ఇది వానలు కురవని కరువు కాలాల్లో భూగర్భ జలాల్ని వినియోగించుకుని, వ్యవసాయదిగుబడులను నిరంతరాయంగా సాధించడానికి వీలౌతుంది.